వెంట్రుక వెన‌క క‌థ‌

వెంట్రుక వెన‌క క‌థ‌
సందేహం
వెంట్రుక వెన‌క క‌థ‌
హాయ్‌! ఫ్రెండ్స్‌... నేను వెంట్రుకని. మీరంతా ఇంగ్లిషులో నన్నే హెయిర్‌ అనేస్తుంటారుగా. మీ తలపై జుత్తై రక్షణ ఇస్తుంటా. కనుబొమ్మలు, కనురెప్పలుగా మారి కళ్లను కంటికి రెప్పలా కాపాడేస్తుంటా. ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం దేహానికి రక్షణకవచంగానూ పనిచేస్తా. ఇవన్నీ మీకు చెప్పక్కర్లేని ముచ్చట్లే. మరి ఎందుకు మా ముందుకు వచ్చినట్టు అంటారా? నా గురించి చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలానే ఉన్నాయని. మరి మొదలెట్టనా!?
మన శరీరంలో బోలెడు అవయవాలు... వేటికవే ప్రత్యేకమైనవి... తమ తమ పాత్రల్ని గొప్పగా పోషిస్తాయి... వాటి ముచ్చట్లేంటో ఒక్కటొక్కటిగా తెలుసుకుందామా!
సగటు వ్యక్తి తలపై లక్ష నుంచి లక్షన్నర వెంట్రుకలుంటాయి.
వేడి వాతావరణంలో జుత్తు కాస్త వేగంగా పెరుగుతుంది.
మగ వాళ్ల జుత్తుకి, ఆడవాళ్ల జత్తుకి పెరగడం, నిర్మాణంలో ఎలాంటి తేడా ఉండదు.
శాస్త్రవేత్తలు... వెంట్రుకల్ని పరీక్షించి ఆ వ్యక్తి తీసుకున్న ఆహారం, ఉంటున్న వాతావరణ పరిస్థితులు చెప్పగలరు.
*  ఒక వెంట్రుక 100 గ్రాముల బరువును మోయగలదు.
అసలు నేనంటే?
జంతువుల్లోనైనా, మనుషుల్లోనైనా నేను తయారవ్వడానికి అసలు కారణం కెరటీన్‌ అనే ప్రోటీన్‌.
ఇంతకీ ఆ కెరటీన్‌ శరీరంలో ఎలా తయారవుతుంది?
ఇది చర్మం కింద హెయిర్‌ రూట్‌ అదేనండీ వెంట్రుక మొదలు దగ్గర కొన్ని కణాలతో తయారవుతుంది. ఇక ఈ హెయిర్‌ రూట్‌ అనేది సన్నని ట్యూబ్‌లాంటి కుదురులో(ఫాలికల్‌) ఉంటుంది. ఇదే జుత్తుకు మూలం. ఎన్ని కుదుళ్లు ఉంటే తలపై అన్ని వెంట్రుకలు ఉంటాయి. ఈ కుదుళ్లు...  సిబేషన్‌ అనే గ్రంథికి అతికి ఉంటాయి. ఈ గ్రంథినే తైల గ్రంథి అని పిలుస్తారు. తలస్నానం చేసిన రెండు మూడు రోజులకు జుత్తంతా జిడ్డు జిడ్డుగా మారినట్టు ఉంటుంది కదూ... ఆ... ఆయిల్‌ని ఉత్పత్తి చేసేది ఈ గ్రంథినే. ఇది లోపలి నిర్మాణం.
మరి నా బయటి నిర్మాణమో?
నేను పెరగడం మొదలవ్వగానే హెయిర్‌ రూట్‌, కుదురు(ఫాలికల్‌) నుంచి పూర్తిగా బయటకు వచ్చేస్తా. అప్పుడేగా చర్మంపైకి వచ్చి మీకు కనిపించేస్తా.
నా పోషణ మాటేంటీ?
ప్రతి కుదురు దగ్గర చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఇవి హెయిర్‌ రూట్‌కి పోషణ అందిస్తాయి. మనం తినే ఆహారం ద్వారా రక్తంలో కలిసే పోషకాలు వెంట్రుకల కుదుళ్లకు అందుతాయి. అంటే నేను
ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సినవన్నీ ఇస్తాయన్నమాట. ఎప్పుడయితే నేను చర్మంపైకి వచ్చేస్తానో నాలో ఉన్న కణాలన్నీ చనిపోతాయి. అంటే మీకు శరీరంపై కనిపించే వెంట్రుకలన్నీ మృతకణాలతో (డెడ్‌సెల్స్‌) ఉన్నవే. అందుకే మీ వెంట్రుకల్ని కత్తిరించినా మీకు ఎలాంటి నొప్పి, బాధ కల్గదు. హెయిర్‌ రూట్‌ మాత్రం సజీవంగానే ఉంటుందండోయ్‌. దీని వల్లే జుత్తు గట్టిగా లాగినప్పుడు తల మాత్రం నొప్పిగా ఉంటుంది.
పెరుగుతూనే ఉంటానా మరి?
మీ తలపై నాలాంటి వెంట్రుకలు లక్షకుపైనే ఉన్నా.. రోజూ అందులో కొన్ని రాలిపోతూనే ఉంటాయి. తలస్నానం చేసినప్పుడో, దువ్వినప్పుడో నిత్యం 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోతాయి. అలా పోతే ఎలా? అని కంగారుపడక్కర్లేదు. ఎందుకంటే వాటి స్థానంలోనే మళ్లీ నాలాంటి వెంట్రుకలు వస్తాయి.
ఒక వెంట్రుక 2 నుంచి 6 ఏళ్ల వరకు పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని నెలలు అలానే ఉండిపోయి చివరకు రాలిపోతుంది. మళ్లీ దాని స్థానంలోనే అదున్న కుదురు (ఫాలికల్‌) నుంచే ఇంకో కొత్త వెంట్రుక పుడుతుంది. మేం పెరగడం... విశ్రాంతి తీసుకోవడం... రాలిపోవడం అనేది ఓ చక్రం.
నా రంగుల్లో తేడాలెందుకు?
జుత్తు... మీదొక రంగులో, మీ ఫ్రెండ్స్‌ది ఇంకోలా ఉంటుంది. నల్లగా, ఎర్రగా ఎన్నెన్నో రకాలు. దానికి కారణం ఏంటో చెప్పనా? మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం. ఇది ఎక్కువగా ఉంటే
వెంట్రుకలు నల్లగా... తక్కువగా ఉంటే లేత రంగుల్లో ఉంటాయి.
రింగుల జత్తు ఎందుకో?
వెంట్రుకలు ఉంగరాల్లా రింగు రింగులు తిరిగి ఉండటానికి, నిటారుగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వెంట్రుక కుదుళ్లు (ఫాలికల్స్‌). ఈ కుదుళ్లు క్రమంగా లేకపోతే దాన్నించి వెంట్రుకలు అండాకారంలో పుట్టి ఉంగరాలు తిరుగుతాయి. అదే కుదుళ్లు నిదానంగా ఉంటే నిటారుగా ఉంటాయి.
బట్టతల ఎందుకొస్తుంది?
జుత్తు రాలిపోతూ మళ్లీ వస్తుంటుందని చెప్పుకొన్నాం కదా. అయితే బట్టతల రావడానికి వాతావరణ పరిస్థితులు, అనారోగ్యం, జన్యువులు, కుదుళ్లు  రాలిపోవడం... వంటి కారణాలు బోలెడు.
అరచేయి, అరికాళ్లపై నేను ఎందుకు ఉండనో తెలుసా?
దీనికి కారణం ఆ ప్రాంతాల్లో చర్మం కాస్త దళసరిగా ఉండటంతో వెంట్రుక కుదుళ్లు(ఫాలికల్స్‌) ఏర్పడే అవకాశం లేదు. కుదుళ్లు లేకపోతే వెంట్రుకలు పుట్టవన్నమాట.

Post a Comment

Previous Post Next Post