వృద్ధుల ఆరోగ్యం, Health For Elder People


వృద్ధుల ఆరోగ్యం
 Health for Elder People 

సమస్యలతో స్వారీ
కొన్ని సమస్యలు అంతే! తగ్గేవి కాదు. అలాగని తప్పించుకు తిరిగేవీ కాదు. స్వారీ తప్పదు!! అది కీళ్ల నొప్పులు కావచ్చు.. ఆస్థమా కావచ్చు.. గుండె వైఫల్యం.. పక్షవాతం.. క్యాన్సర్‌.. ఇలా దీర్ఘకాలం వేధించే బాధలేవైనా కావచ్చు.. వీటితో నెగ్గుకొచ్చేదెలా? ఇవి మనల్ని పూర్తిగా ఆక్రమించి.. జీవితమంతా అతలాకుతలం చెయ్యకుండా... వీటిని నియంత్రణలో ఉంచుకుంటూ.. ఒక రకంగా వీటితో సహజీవనం చేస్తూ.. సాధ్యమైనంత సాంత్వనతో జీవితం గడిపేదెలా? 
వృద్ధుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మన సమాజంలో దీర్ఘకాలిక సమస్యలూ పెరుగుతున్నాయి. ఇవి పూర్తిగా తగ్గేవి కాకపోవచ్చు. వీటితో నిత్యం ఎంతోకొంత ఇబ్బంది తప్పకపోవచ్చు. అలాగని వీటికి పూర్తిగా లొంగిపోయి, నిత్యం నరకం అనుభవించాల్సిన అవసరమేం ఉండదు. కాకపోతే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యల విషయంలో మనం ఎలాంటి వైఖరి అవలంబించాలి...? మనల్ని మనం ఎలా సంసిద్ధులను చేసుకోవాలన్నదే కీలకం.
కొన్ని జబ్బులు ఉన్నట్టుండి ముంచుకొస్తాయి. చికిత్సతో పూర్తిగా తగ్గిపోతాయి. కొద్దిరోజులు ఇబ్బంది పడినా తర్వాత మళ్లీ మామూలైపోతాం. కాబట్టి వీటి గురించి పెద్దగా చర్చలేమీ అక్కర్లేదు. కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా చూస్తున్న మధుమేహం, హైబీపీ నుంచి కీళ్ల నొప్పలు, ఆస్థమా, గుండె వైఫల్యం, పక్షవాతం, ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల క్యాన్సర్ల వరకూ.. చాలా వ్యాధులు ఒక పట్టాన నయమైపోయేవి కాదు. ఇవి దీర్ఘకాలం (క్రానిక్‌) మనతోనే ఉంటాయి. వీటిలో కొన్నింటిని చికిత్సతో కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. కొన్ని చికిత్సతో తగ్గినా.. కొద్దిరోజులు బాగానే ఉండి మళ్లీ కొన్నాళ్లకు తిరగబెట్టొచ్చు. అయితే.. ఈ దీర్ఘకాలిక సమస్యల విషయంలో కూడా వైద్యుల సలహా తీసుకుంటూ.. నిత్యం ఆహారం, జీవనశైలి వంటివి మార్చుకుంటూ... మానసికంగానూ, శారీరకంగా కూడా మనల్ని మనం సరైన తీరులో సంసిద్ధం చేసుకుంటే.. వీటి ప్రభావాన్ని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చు. అందరిలా హాయిగానూ జీవించొచ్చు.
సమస్యలు పలురకాలు!
తగ్గే సత్తువ, కలివిడి: దీర్ఘకాల సమస్యలతో బాధపడేవారిలో సత్తువ, సామర్థ్యం తగ్గిపోతాయి. దీంతో మానసిక వేదన, అసహనం పెరుగుతాయి. ఉదాహరణకు ఉబ్బసంతో బాధపడే వ్యక్తి చలికాలం ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరాల్సి వస్తే ఆయాసం ఉద్ధృతం కావొచ్చు. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలోనూ ఇలాంటి ఇబ్బందులు కనబడతాయి. ఇలాంటివన్నీ చిరాకు తెచ్చిపెడతాయి. దీంతో రాజీపడటం కష్టమవుతుంది.
ఆర్థిక సమస్యలు: శారీరక సవాళ్లతో పాటు ఆర్థిక సవాళ్లు కూడా వీరికి ఎక్కువే. మనదేశంలో 70% వైద్యం ప్రైవేటు రంగంలోనే ఉంది. ఆరోగ్యబీమా చేయించుకున్నవారు తక్కువ. బీమా ఉన్నా దీర్ఘకాల సమస్యలకు వర్తించేవి తక్కువ. ఒకవేళ వర్తించినా తక్కువ మొత్తమే వస్తుంది. దీర్ఘకాల సమస్యల వల్ల తరచుగా ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం, ఆఫీసుకు సెలవులు పెట్టటం, మందుల ఖర్చులు, రవాణా ఖర్చులు.. ఇవన్నీ ఆర్థికంగా భారంగా పరిణమిస్తాయి. ఇది ఆందోళన పెరగటానికీ దారితీస్తుంది.
సంబంధాలకు విఘాతం: దీర్ఘకాల సమస్యలతో బాధపడే వారిని కుటుంబంలో కొందరు విసుక్కోవచ్చు. ఇంకొందరు తమకు భారంగా మారారని అనుకోవచ్చు. దీన్ని అధిగమించటమూ సవాలే. దీర్ఘకాల సమస్యలు ఆయా వ్యక్తులకే కాదు, కుటుంబ సభ్యులకూ ఆందోళన కలిగిస్తాయి. ‘ఏంటీ జబ్బు? ఎంతకీ తగ్గదా?’ అని బాధపడటం వల్ల చూసుకునే వారిలోనూ ఒత్తిడి (కేర్‌గివర్‌ స్ట్రెస్‌) తలెత్తుతుంది. చివరికి దీర్ఘకాల జబ్బు బాధితులకు రోజువారీ జీవితమే భారంగా తయారవుతుంది. భర్తకో భార్యకో దీర్ఘకాల సమస్యలుంటే వారి మధ్య శృంగార సంబంధాలు దెబ్బతినొచ్చు. దీనికి సర్దుకుపోవటం పెద్ద సవాలే!
లోపించే ఆత్మవిశ్వాసం: అన్నింటికన్నా ముఖ్యంగా ఆత్మ స్థైర్యం, ఆత్మ విశ్వాసం.. రెండూ దెబ్బతింటాయి. ప్రతిచోటుకీ ఎవరో ఒకరు పట్టుకొని తీసుకెళ్లాల్సి రావటం చిన్నతనంగా అనిపిస్తుంటుంది. తమను తాము 
నిందించుకుంటారు కూడా. ‘నేను అందరికీ భారమవుతున్నాను. చుట్టుపక్కల వాళ్లంతా నా మూలంగా బాధపడుతున్నారు. నేను దేనికీ పనికిరాను’ అనే న్యూనతలోకి వెళతారు. దీంతో వారిలో ప్రతికూల భావోద్వేగాలు మొదలవుతాయి. నిస్సహాయ ధోరణి, దాన్నుంచి కోపం, చికాకు వంటివీ బయలుదేరతాయి. అలాగే జబ్బుల తీరును బట్టి ‘ఇక జీవితమంతా ఇంతే’ అనే నిస్పృహ, నిరాశ, దుఃఖం, బాధ వంటివీ పొడసూపుతాయి. అనంతరం ఈ జబ్బు నాకే ఎందుకు రావాలనే ఆగ్రహం కూడా మొదలవుతుంది. దాన్ని చుట్టుపక్కల వాళ్ల మీద ప్రదర్శిస్తుంటారు. ఎవరైనా సాయం చేయటానికి వస్తే వారిమీదా చికాకు పడుతుంటారు. క్యాన్సర్లు, హెచ్‌ఐవీ, కొన్ని రకాల నాడీ సంబంధ సమస్యల్లో ప్రతికూల భావోద్వేగాల ధోరణి ఎక్కువ.
అంగీకారానికే బోలెడు దశలు!
దీర్ఘకాలిక వ్యాధుల బాధితుల్లో రకరకాల ప్రతికూల భావోద్వేగాలకు మూలం ‘పని చేసే సామర్థ్యం తగ్గిపోయింది’ అన్న భావన. అప్పటివరకూ తాము చేసే పనులు చేయలేకపోవటం పెద్ద లోపంగా కనిపిస్తుంది. ఇలా దేన్నైనా కోల్పోయినప్పుడు దాన్ని ఆమోదించటమనేది ఒక్కసారిగా జరగదు. దశలు దశలుగా సాగుతుంది. తొలిదశలో.. వ్యాధి వచ్చిందని డాక్టర్‌ చెప్పినపుడు దాన్ని వెంటనే అంగీకరించరు. ముందు తమకే వ్యాధీ లేదని తోసిపుచ్చుతారు. ‘జబ్బును సరిగా నిర్ధరించారో లేదో’, ‘నాకేంటి? ఈ జబ్బు రావటమేంటి?’ అనుకుంటారు. కొన్ని జబ్బులకు తొలిదశలో గుర్తించే పరీక్షలు ఉండవు. అందువల్ల ఇది ఆ జబ్బు కాకపోవచ్చని భావిస్తుంటారు. మొదట్లో రిపోర్టులను డాక్టర్‌ సరిగా చూశాడో లేదోననే భావనతో ‘మరోసారి జాగ్రత్తగా చూడండి’ అని అడుగుతుంటారు. అయితే కొద్దిరోజులు పోయాక, లక్షణాలు ముదురుతున్న కొద్దీ నమ్మటం ఆరంభిస్తారుగానీ.. మరోవైపు ‘లోకంలో ఇంతమంది ఉన్నారు. ఇది నాకే ఎందుకు రావాలి?’ అనే ఆగ్రహ ధోరణి ఆరంభమవుతుంది. మరికొందరు దేవుడిని వేడుకుంటే జబ్బు తగ్గుతుందేమోననే ఆశతో మొక్కుకుంటుంటారు. మొక్కులు తీర్చలేదేమో అని భయపడతారు కొందరు. ఇవేవీ ఫలించక, జబ్బు ముదిరిపోతున్న సమయంలో కుంగుబాటుకూ లోనవుతుంటారు. ‘డాక్టర్‌ ముందే చెప్పాడు, నేనే నమ్మలేదు, ఇప్పుడిలా జబ్బుతో బాధపడుతున్నాను’ అని అనుకుంటూ ఒక రకమైన నిరాశలో కూరుకుపోతుంటారు. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ తర్వాత ఇక తప్పనిసరి పరిస్థితుల్లో జబ్బును పూర్తిగా అంగీకరిస్తారు. ‘ఇది జీవితాంతం భరించక తప్పదు. ఎలాగోలా బండి నెట్టుకొద్దాం’ అని క్రమేపీ అలవాటు పడిపోతుంటారు. నెమ్మదిగా జబ్బుతో నిలదొక్కుకోవటమెలా? అందుకు ఏం చేయాలి? అని ఆలోచనకు వస్తారు. ఈ దశకు రావటానికి చాలామందిలో కొన్ని వారాలు, నెలలు కూడా పట్టొచ్చు. జాలి.. అసహనం.. రెండూ వద్దు! దీర్ఘకాలిక సమస్యల్లో బాధ, నొప్పి వంటి లక్షణాలు చాలాకాలం వేధిస్తుంటాయి కాబట్టి జీవన విధానమూ మారిపోతుంది. వీరిని స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు అంత త్వరగా అర్థం చేసుకోలేరు. ఏదో జబ్బుతో బాధపడుతున్నారని అనుకుంటుంటారు గానీ జబ్బు తీవ్రతను, దానికా వ్యక్తి ఎలా స్పందిస్తున్నారన్నది తెలుసుకోలేరు. దీంతో వీరిపై కొందరు జాలి చూపితే, మరికొందరు చిరాకు పడటం మొదలెడతారు.
1. జాలి చూపటం: ఎవరికైనా దీర్ఘకాలిక జబ్బు ఉందని తెలియగానే ఇంట్లో వాళ్లు, బంధువులు ‘అయ్యో మీకు జబ్బువచ్చిందా?’ అని జాలి చూపించటం మొదలెడతారు. అలాగే ‘జబ్బుతో ఎందుకు ఇబ్బందిపడతావు? నీ చేతకాదు, విశ్రాంతి తీసుకో’ అని అతి శ్రద్ధ కూడా చూపిస్తుంటారు. ప్రతి చిన్న పనిలోనూ సాయపడటం, ఏదైనా అవసరంతో లేచినా వెంటనే దగ్గరకు వచ్చి పట్టుకోవటం వంటివీ చేస్తుంటారు. ఇది జబ్బు బారినపడ్డవారికి మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. ‘ఏంటీ నేనీ చిన్న పని కూడా చేసుకోలేనా? అంత తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నానా’ అనే న్యూనతా భావంలోకి జారటానికీ దారితీస్తుంది.
2. అసహనం: మరికొందరేమో ‘ఆ.. వీడో జబ్బు మనిషి. మనం ఏం చేసినా, ఏం చెప్పినా ఇంతే. రోజంతా, మనిషి కనబడినప్పుడల్లా తన బాధల గురించి ఏదో ఒకటి చెబుతూనే ఉంటాడు’ అని చిరాకు, కోపం, అసహనం ప్రదర్శిస్తుంటారు.
నిజానికి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారిపై జాలి చూపటం, అసహనం ప్రదర్శించటం రెండూ పనికిరావు. అంతకన్నా వారినెలా అర్థం చేసుకోవాలి? వారిని తిరిగి మామూలు జీవన సరళిలోకి ఎలా తీసుకురావాలి? అనే వాటిపై దృష్టి పెట్టటం అవసరం. ఇంట్లోవాళ్లు, స్నేహితులు, బంధువులంతా కూడా- దీర్ఘకాలిక సమస్యకు అనుగుణంగా బాధితులు తమను తాము సిద్ధపరచుకోవటానికి, తదనుగుణంగా మార్పులు చేసుకోవటానికి మనమెలాంటి సాయం చెయ్యగలమనేది ఆలోచించాలి.
చెప్పుకోలేని లక్షణాలు!
దీర్ఘకాలిక సమస్యలు గలవారిలో నొప్పి, బాధ వంటి లక్షణాలు ఇంట్లో వాళ్లకు కొంతవరకూ తెలుస్తుంటాయి. సరిగా నడవలేకపోవటం, కొద్దిదూరం నడవగానే ఆయాసం, తలనొప్పితో బాధపడుతుండటం వంటి విస్పష్ట లక్షణాలను తేలిగ్గానే గుర్తించొచ్చు. అయితే కొన్ని లక్షణాలు బయటకు కనబడవు. చాలాసార్లు వీళ్లు మనసులోనే బాధపడుతుంటారు. బయటకు చెబితే ఏమనుకుంటారో ఏమో అని సందేహిస్తుంటారు. ‘వీడెప్పుడూ ఇంతే. ఏదో ఒక రోగం గురించి చెబుతూనే ఉంటాడు. నన్నొక రోగిష్ఠి కింద జమకడతారు’ అని భావిస్తూ.. ఒక రకమైన సంఘర్షణకూ గురవుతుండొచ్చు. ఇలాంటి కనబడని లక్షణాలను ఇంట్లో వాళ్లే కాదు, డాక్టర్లు కూడా పోల్చుకోలేకపోవచ్చు.
ఆందోళన, ఒత్తిడి 
ప్రతికూల భావాద్వేగాలు కొన్ని మానసిక సమస్యలకూ దారితీయొచ్చు. వీటిల్లో ప్రధానమైనవి తీవ్ర కుంగుబాటు, తీవ్ర ఆందోళన. దాదాపుగా దీర్ఘకాలిక వ్యాధులన్నింటిలో ఈ రెండూ తప్పవు. కుంగుబాటు మూలంగా బాధలు రెట్టింపు అవుతాయి. మామూలుగానే కుంగుబాటులో శారీరక బాధలుంటాయి. ఇక అప్పటికే జబ్బుతో బాధపడుతుంటే ఇవి మరింత ఎక్కువ అవుతాయి. దీన్ని గుర్తించి చికిత్స చెయ్యటం అవసరం. లేకపోతే వాళ్లు మరింత కుంగుబాటులోకి జారిపోయే అవకాశముంది. చివరికి తానేం చెప్పినా ఎవరూ వినటం లేదు, పట్టించుకోవటం లేదనే నిస్పృహలో కూరుకుపోయి, పూర్తిగా డీలాపడిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘సెకండరీ డిప్రెషన్‌’ అంటారు. దీన్ని గుర్తించి, సరైన చికిత్సతో పరిస్థితిని చాలావరకూ చక్కదిద్దచ్చు.
బయటపడేదెలా? 
దీర్ఘకాలిక వ్యాధి వచ్చిందని తెలియగానే ఏదో భూకంపం వచ్చినట్టు, పిడుగు నెత్తిన పడ్డట్టు భావించాల్సిన పనిలేదు. జబ్బును ఎదుర్కొంటూ సరైన చికిత్స తీసుకుంటూ.. దానికి అనుగుణంగా ఎలా మారాలనే దానిపై దృష్టి పెట్టాలి. చుట్టుపక్కల వాళ్లు, డాక్టర్ల సాయంతో శారీరకంగా, మానసికంగా స్థిరంగా ఉండేందుకు చేసుకోవాల్సిన మార్పులపై మనసు నిలపాలి.
ఎదుర్కోవటం కీలకం: దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్నప్పటికీ.. దాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా జీవించటమెలాగో దగ్గరివాళ్లు వారికి నేర్పించాలి. చికిత్సతో దాన్ని ఎలా నియంత్రించుకోవచ్చో అర్థమయ్యేలా చెప్పాలి. 
మందులు మానరాదు: కొన్ని దీర్ఘకాలిక జబ్బులు చికిత్స తీసుకుంటుంటే తగ్గుముఖం పడతాయి. కానీ చికిత్స మానేస్తే కొద్దిరోజులకు మళ్లీ తిరగబెడతాయి. ఉదాహరణకు మధుమేహులనే తీసుకుంటే.. ఆహార నియమాలు పాటిస్తూ, మాత్రలో ఇన్సులినో తీసుకుంటుంటే రక్తంలో గ్లూకోజు స్థాయులు తగ్గుతాయి. దీంతో కొందరు ‘షుగర్‌ తగ్గింది కదా, ఇంకెందుకు అన్నీ పాటించాలి. డాక్టర్లు ఏదో చెబుతుంటారు గానీ ఇప్పుడివన్నీ ఎందుకు లే’ అనుకొని మానేస్తుంటారు. దీంతో కొన్నాళ్లకు సమస్య మళ్లీ తవ్రమవుతుంది. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధుల్లో క్రమం తప్పకుండా, డాక్టర్లు సూచించినంత కాలం చికిత్స తీసుకోవటం తప్పనిసరనే విషయాన్ని మనసుకు హత్తుకునేలా చెప్పాలి.
అన్నీ చర్చించాలి: లక్షణాలను, బాధలను సవివరంగా డాక్టర్లకు చెప్పటం కీలకం. ఎందుకంటే దీర్ఘకాలిక జబ్బుల్లో కొన్ని బాధలు పైకి కనిపిస్తుంటాయి. మరికొన్ని కనిపించవు. వృద్ధులు తాము ఇతరులకు భారమవుతున్నామని భావిస్తూ కొన్ని విషయాలు చెప్పకుండా దాచేస్తుంటారు. ‘మనం లక్షణాలు చెప్పినకొద్దీ డాక్టరు మరో రెండు మందులు రాస్తారు. దీంతో ఖర్చు పెరుగుతుంది. ఇంట్లో వాళ్లకు కష్టమవుతుంది’ అని అనుకుంటూ సగం లక్షణాలు చెప్పటం మానేస్తారు. లోలోపలే బాధపడుతుంటారు. చివరికి సమస్య ముదిరి ఏదో ఒకరోజు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అలాంటి స్థితిని తెచ్చుకోకుండా తమకు గల సమస్యను సవివరంగా డాక్టరుకు చెబితే తగు సహాయం చేయటానికి వీలుంటుంది.
పనుల్లో నిమగ్నం: ‘నేనేం చెయ్యలేను’ అని ఎప్పుడూ ఒక మూలకు కూర్చోవటం, లేదూ అదేపనిగా జబ్బు గురించి ఆలోచిస్తుండటం కన్నా చేతనైనంత మేరకు చిన్న చిన్న పనులు కల్పించుకుంటుంటే ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఖాళీగా ఉంటే ఏ చిన్న లక్షణం కనబడినా జబ్బు మూలంగానే వచ్చిందేమోననే చింత ఎక్కువవుతుంది. అందువల్ల ఏ మాత్రం అవకాశమున్నా పనుల్లో పాలు పంచుకోవటం మంచిది. ఉదాహరణకు కీళ్లనొప్పులతో బాధపడే గృహిణి అస్తమానం కుర్చీలో కూచొని ‘అవి తీసుకురా, ఇవి తే’ అనే కన్నా.. వంటింట్లో కుర్చీలో కూర్చునే కూరలు కడగటం, తరగటం వంటివి చేస్తే హుషారుగా కూడా ఉంటుంది. శరీరం సహకరిస్తున్న పనులపై దృష్టి పెట్టాలి. మంచి పుస్తకం చదవటమో, నచ్చిన సంగీతాన్ని వినటమో, స్ఫూర్తినిచ్చే ప్రసంగాలను వినటమో.. ఇలా సంతోషం కలిగించే వాతావరణాన్ని సృష్టించుకునే ప్రయత్నం చెయ్యాలి. జీవితం పట్ల ఆశావహ దృక్పథం వీడకూడదు.
ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి: ఉద్యోగులు తమ సమస్య గురించి పైఅధికారులకు చెప్పి, తాము బాగా చెయ్యగల పనుల గురించి చర్చించొచ్చు. ఉదాహరణకు శ్వాస సమస్యలు గలవారు ఏసీలో కూచోలేకపోతుంటే వేరే చోటుకు మారొచ్చు. దీంతో పని సామర్థ్యం పెరుగుతుంది. ఉద్యోగికీ, యాజమాన్యానికీ ఇద్దరికీ మేలు జరుగుతుంది. ఉద్యోగమేదీ లేని వారిని స్వచ్ఛందసంస్థలో చేర్పించొచ్చు. దీంతో వారి నైపుణ్యాలు, అనుభవాలు సమాజానికీ ఉపయోగపడతాయి. 
తమలాంటి వారి మద్దతు: దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి ‘సపోర్టివ్‌ గ్రూపు’లు బాగా ఉపయోగపడతాయి. ఇదే జబ్బుతో తామూ బాధపడుతున్నామని, పదేళ్ల క్రితమే తమకీ జబ్బు వచ్చిందని, ఇంతకాలం తామెలా గడిపామో, ఎలా దీన్ని భరించే అవకాశముందో అనే విషయాలను, అనుభవాలను ఒకరికొకరు పంచుకోవటం ఎంతో మేలు చేస్తుంది. కొత్తగా అలాంటి జబ్బు బారినపడ్డవారికివి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. మనదేశంలో ఈ సపోర్టివ్‌ గ్రూపులు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. 
వ్యక్తిగత కౌన్సెలింగ్‌: సాధారణంగా కౌన్సెలింగ్‌కు వచ్చినపుడు వ్యక్తులు తమకు అనుకూలమైన అంశాలను మాత్రమే స్వీకరిస్తారు. పూర్తి అవగాహన ఏర్పరచుకోరు. ఇలాకాకుండా వ్యక్తిగతంగా కౌన్సెలింగ్‌లో వ్యాధి, దాని ప్రభావాల నుంచి బయటపడటం గురించి పూర్తి అవగాహన పెంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. జబ్బు బారినపడ్డవారిని ఏ దృక్పథంతో చూడాలి? వారినెలా ప్రోత్సహించాలి? వారి పనులు వాళ్లు చేసుకునేలా ఎలా చేయాలి? అన్న దానిపై కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్‌ అవసరం. వైకల్యం బారినపడ్డవారికి ఉన్నదాంతోనే ఎలా పని చేసుకోవచ్చన్నది ఆక్యుపేషనల్‌ థెరపిస్టుతో గానీ వొకేషనల్‌ ట్రెనర్‌తో గానీ చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. బాధితుల అవసరాలు, సామర్ధ్యాలను గుర్తించి తగువిధంగా ప్రోత్సహిస్తే మంచి ఫలితం కనబడుతుంది.
భయం వృథా: చాలామంది తమ జబ్బు గురించి ఇంటర్‌నెట్‌లో ఏవేవో చదివేసి అపోహలూ పెంచుకుంటారు. భయపడిపోతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. దీనికంటే సరైన సమాచారంతో కూడిన పుస్తకాలను చదవటం మంచిది. ఆ తర్వాత ఏవైనా సందేహాలు వస్తే డాక్టర్‌ను అడిగి తెలుసుకోవటం మరీ మంచిది.
జీవనశైలి మార్పులు: వేళకు భోజనం చేయటం, ఆయా జబ్బులను బట్టి శరీరం సహకరించిన మేరకు వ్యాయామం చేయటం వంటి జీవనశైలి మార్పులు మేలు చేస్తాయి. జబ్బుపడ్డవారిలో చాలామంది ‘నేనెలాంటి దుస్తులు వేసుకుంటే ఏంటి? ఎవరు చూడొస్తారు?’ అని అనుకుంటుంటారు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వేసుకున్న మాదిరిగానే దుస్తులు ధరించాలి. స్త్రీలు కూడా గతంలో చేసుకున్నట్టుగానే అలంకరించుకోవచ్చు. నిస్పృహలోకి పడిపోకుండా, తమపై శ్రద్ధ తగ్గించుకోకపోవటం ముఖ్యమని గుర్తించాలి. తమ పరిధిలో తాము భిన్నంగా ఏం చేయొచ్చో, చేయగలమో అనే దానిపై దృష్టి పెట్టాలి.
ప్రత్యామ్నాయ చికిత్సలపైనే ఆధారపడొద్దు:  దీర్ఘకాల జబ్బులు చాలాకాలం పాటు వేధిస్తుంటాయి. అలోపతి వైద్యంతో కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవచ్చు గానీ పూర్తిగా నయమవుతాయని మాత్రం చెప్పలేం. దీంతో చాలామంది తేలికగా తగ్గిస్తాయనే నమ్మకంతో ఇతర వైద్యవిధానాలపై మొగ్గుచూపిస్తుంటారు. అవెంత వరకు పనిచేస్తాయో తెలియదు గానీ మానసికంగా సాంత్వన ఇవ్వొచ్చు. కాబట్టి ప్రధాన చికిత్సను తీసుకుంటూ వీటని ప్రయత్నిస్తే నష్టం లేదు గానీ అవి తప్పకుండా పనిచేస్తాయనే గుడ్డి నమ్మకంతో మందులు మానటం సరికాదు. దానివల్ల సమస్యలు ముదిరి ఆసుపత్రుల పాలయ్యే ప్రమాదముంది. ఉదాహరణకు మధుమేహం మందులను పూర్తిగా మానేసి, కోమాలోకి వెళ్లే స్థితి తెచ్చుకుంటున్నవారూ ఉంటున్నారు.

Post a Comment

Previous Post Next Post