పథ్యం... కాదు పెనుభూతం! Liver

పథ్యం... కాదు పెనుభూతం!
Liver
కామెర్లు.. కాలేయం.. 
మన శరీరంలోని అంత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ముఖ్యమైంది. ఇది ఒంట్లోని విషతుల్యాలను నిర్వీర్యం చేయటం దగ్గర్నుంచి.. జీర్ణక్రియలో పాల్గొనటం, జీర్ణ ప్రక్రియకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను ఉత్పత్తి చేయటం, మాంసకృత్తులను సంశ్లేషించటం వరకు రకరకాల పనులను నిర్వరిస్తుంటుంది. ఒక కర్మాగారంలా నిరంతరం పనిచేస్తూ.. దేహాన్ని నడిపించే దీనికి వైరస్‌లు, జబ్బుల ముప్పూ ఎక్కువే. ముఖ్యంగా హెపటైటిస్‌ వైరస్‌లు కాలేయంపై దాడికి కాచుకొని ఉంటాయి. ఇవి హెపటైటిస్‌ వంటి సమస్యలకు దారితీస్తాయి. దీంతో కళ్లు, చర్మం పసుపురంగులోకి మారటం.. అదే కామెర్లు.. వంటి లక్షణాలు బయలుదేరతాయి. కామెర్లు అనగానే మనలో చాలామంది నోరు కట్టేసుకొని, పూర్తిగా చప్పిడి తిండి తినాలని భావిస్తుంటారు. చుట్టుపక్కల వాళ్లు కూడా రకరకాల పథ్యాలతో, లేనిపోని అపోహలతో బెంబేలెత్తిస్తుంటారు. నిజానికి కాలేయజబ్బు బాధితులకూ తగినంత పోషకాహారం తప్పనిసరి. దీనిపై అవగాహన పెంచుకుంటే సమస్య తీవ్రం కాకుండానూ చూసుకోవచ్చు. అందుకే కామెర్లలో, కాలేయజబ్బులో ఏం తినాలి? ఏం తినకూడదు? అనే వాటిపై అవగాహన కలిగించేందుకు.. ఈ నెల 29న ‘ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినం’ సందర్భంగా సుఖీభవ అందిస్తున్న ప్రత్యేక కథనం.
కామెర్ల బాధితులు, లివర్‌ జబ్బు గలవారు ఏ రకం ఆహారం తీసుకోవాలి? ఏం తీసుకోకూడదన్నది స్థూలంగా వాళ్లు ఇటీవలే ఈ సమస్య బారినపడ్డారా? 
లేక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారా? అన్న దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. వీటి గురించి వివరంగా చూద్దాం.
నలో చాలామంది ‘కామెర్ల’ను ఒక వ్యాధి అనుకుంటుంటారు. కానీ ఇది ఒక లక్షణం మాత్రమే! మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం కాలేయానికి (లివర్‌కు) ఏదైనా వ్యాధి సోకినప్పుడు అది పైకి కామెర్ల రూపంలో కనబడుతుంది! చాలా కాలేయ వ్యాధుల్లో కనిపించే సర్వసాధారణ లక్షణం ఇది. కాబట్టి ఎవరికైనా కామెర్లు వస్తే- దానికి కారణం ఏమిటి? లివర్‌కు ఎలాంటి సమస్య వచ్చిందన్నది చూడటం అవసరం. దాన్ని బట్టి అసలు పథ్యాలు చెయ్యటం అవసరమా? లేదా? చేస్తే ఎలాంటి పథ్యాలు చెయ్యాలన్నది చూడాల్సి ఉంటుంది. అంతేగానీ కామెర్లు అనగానే.. అంతా ఒకే రకం పథ్యాలు మొదలుపెట్టెయ్యాల్సిన పని లేదు. కానీ మన ప్రాంతంలో ఎవరికైనా కామెర్లు వచ్చాయంటే చాలు.. వెంటనే రకరకాల పథ్యాలు చెబుతుంటారు. కొన్ని పదార్థాలు తింటే కాలేయానికి మంచిదంటుంటారు. మరికొన్ని తింటే లివర్‌ ఇంకా చెడిపోతుందంటుంటారు. కొందరేమో నూనె, కొవ్వు అస్సలు తగలకూడదంటారు. పథ్యం కోసం పొట్లకాయ, బీరకాయ ఉడకేసుకు తినటం మంచిదని చెప్పేవాళ్లు కొందరైతే... పెరుగు, మజ్జిగ తప్పించి ఇంకేమీ ముట్టకూడదని మరికొందరు చెబుతుంటారు. కామెర్లలో మాంసం తినటం మహా ప్రమాదం అనేవాళ్లూ ఉన్నారు. మొత్తానికి కామెర్లు, కాలేయ వ్యాధులు వచ్చినప్పుడు ఇలా పథ్యం అనేదాన్ని పెనుభూతంలా చూస్తూ.. చివరికి అసలేం తినాలో, ఏం తినకూడదో తెలియకుండా అయోమయంగా మార్చేస్తుంటారు. ఇన్ని అనుమానాలు రాజ్యమేలుతున్న నేపథ్యంలో వీటి వల్ల లాభమా? నష్టమా? వీటిలో శాస్త్రీయత ఎంత? అన్నది లోతుగా తెలుసుకోవటం చాలా అవసరం.
అందరికీ ఒకటే కాదు! 
కామెర్లుగానీ, లివర్‌ వ్యాధిగానీ ఉన్న అందరికీ ఒకే రకమైన పథ్యం ఉండదు. ఎందుకంటే కామెర్లలో, లివర్‌ వ్యాధుల్లో రకరకాలుంటాయి. ఒక్కో వ్యాధి తీరు ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు కొన్ని లివర్‌ జబ్బులు మద్యం తాగటం వల్ల వస్తాయి. కొన్ని హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ వంటి వైరస్‌ల కారణంగా వస్తాయి. కొందరికి వీటితో పాటు ఇతరత్రా రకరకాల కారణాల రీత్యా లివర్‌ గట్టిపడిపోయి (సిరోసిస్‌), దాని పనితీరు బాగా దెబ్బతిని ఉంటుంది. దీనిలో కూడా చాలా దశలుంటాయి. కొందరికి లివర్‌ సిరోసిస్‌ మొదలవుతుందిగానీ వ్యాధి ముదరకుండా, స్థిరంగా ఉంటుంది. మరికొందరికి వేగంగా దెబ్బతినిపోతుంటుంది. కాబట్టి వీటిన్నింటినీ దృష్టిలో ఉంచుకొనే వీళ్లు ఏంతినొచ్చు, ఏం తినకూడదన్నది సిఫార్సు చెయ్యాల్సి ఉంటుంది.
రోగులు: రెండు రకాలు! 
కాలేయ వ్యాధి బాధితులను ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు.
1. ఇటీవలే.. అంటే ఓ ఆర్నెల్ల లోపలే కాలేయ వ్యాధి బారినపడ్డ వాళ్లు. దీన్నే ‘అక్యూట్‌ హెపటైటిస్‌’ అంటారు. కామెర్లు వచ్చిన వాళ్లలో చాలామంది ఈ రకానికి చెందినవారే!
2. దీర్ఘకాలంగా.. అంటే ఆర్నెల్లకు మించి కాలేయ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు. వీళ్లలో కాలేయం నెలల తరబడి వాచిపోయి, కాలేయ కణాలు దెబ్బతింటాయి. వీరిలో- మామూలుగా మెత్తగా, మృదువుగా ఉండాల్సిన కాలేయం కాస్తా గట్టిపడటం (సిరోసిస్‌) మొదలవుతుంది. హెపటైటిస్‌-బి, హెపటైటిస్‌-సి, మద్యం తాగటం, లివర్‌ చుట్టూ కొవ్వు చేరటం (ఫ్యాటీ లివర్‌), కొన్ని మందుల వంటివి దీనికి కారణమవుతాయి.


కామెర్లు - స్వల్పకాలం
స్వల్పకాలిక లివర్‌ వ్యాధి హెపటైటిస్‌ వైరస్‌ల వల్ల రావచ్చు, అలాగే మద్యం, మందుల వంటి వాటి వల్ల కూడా రావచ్చు. వైరస్‌లలో- హెపటైటిస్‌ ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలున్నాయి. వీటిలో మనం సర్వసాధారణంగా చూసే కామెర్లు- ఎ, ఇ అనే వైరస్‌ల మూలంగా వచ్చేవి. ఇవి చాలావరకూ మన ఆహారం, తాగునీరు కలుషితం కావటం వల్లే సంప్రాప్తిస్తాయి. ఇక బి, సి వైరస్‌ల కారణంగా వచ్చే సమస్య కాస్త భిన్నమైంది, ఇది కలుషిత రక్తం తగలటం, ఇప్పటికే ఈ వైరస్‌ ఒంట్లో ఉన్నవాళ్ల రేజర్లు, బ్రష్షుల వంటివి వాడటం వల్ల రావచ్చు. నిజానికి వైరస్‌ల కారణంగా వచ్చే కామెర్లు దానంతట అదే తగ్గిపోతుంది. ప్రత్యేకమైన మందులేమీ అక్కర్లేదు. క్రమేపీ కాలేయం దానంతట అదే కోలుకుంటుంది. కాకపోతే రోగి పరిస్థితిని బట్టి వాంతులు తగ్గేందుకు, ఆకలి పెరిగేందుకు, నీరసం తగ్గేందుకు.. ఉపశమన చికిత్స చెయ్యాల్సి ఉంటుంది. కామెర్ల బాధితుల్లో 99% మంది అసలు ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దనే ఉంటూ ఉపశమన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.
మన ప్రాంతంలో కామెర్లు వచ్చాయంటే చాలు.. విపరీతమైన పథ్యాలు మొదలుపెడుతున్నారు. చాలామంది సాధారణ ఆహారం మానేసి.. పథ్యాల పేరుతో మజ్జిగ, బార్లీ, నిమ్మరసం, గంజి, జావల వంటివే ఇస్తుంటారు. ఇవేవీ కూడా బలవర్ధకమైనవి కావు. వాస్తవానికి ఇలాంటి కామెర్లతో బాధపడుతున్న సమయంలో బలవర్ధక ఆహారం- ముఖ్యంగా ప్రోటీన్లు, విటమిన్ల వంటివి ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వటం అవసరమని ఎన్నో అధ్యయనాల్లో గుర్తించారు. ఏమంత శక్తినివ్వని మజ్జిగ, జావల వంటివే కాదు.. నూనె, కొవ్వులేమీ లేకుండా ఉడకేసిన చప్పిడి పదార్థాలే పెట్టటం వల్ల నోటికి రుచించక, మొత్తం తిండే తగ్గిపోతుంది. దీంతో మనిషి బలహీనపడటంతో పాటు జబ్బు నుంచి కోలుకోవటానికీ దీర్ఘకాలం పడుతోందని, దీనివల్లే మన దేశంలో కామెర్ల బాధితులు ఎక్కువ కాలం బాధపడాల్సి వస్తోందని స్పష్టంగా గుర్తించారు. అందువల్ల పెద్దవాళ్లు చెప్పారనో, పక్కింటి వాళ్లు సలహాలిచ్చారనో పాటించటం కాకుండా.. కామెర్ల బాధితులకు కాస్త శక్తివంతమైన ఆహారం ఇవ్వటం చాలా అవసరం. ఈ సమయంలో వాంతులు, వికారం ఎక్కువ, అన్నహితవు కూడా సరిగా ఉండదు కాబట్టి- పథ్యాల పేరుతో తిండి తగ్గించటం లేదా మాన్పించటం కాకుండా.. సాధ్యమైనంత బలవర్ధక ఆహారం తినిపించాలి. చాలామందికి ఉదయం పూట వికారం బెడద ఎక్కువుండదు. కాబట్టి ఉదయాన్నే తినగలిగినంత బలవర్ధకమైన టిఫిన్‌ పెట్టటం మంచిది. తక్కువ తక్కువ పరిమాణంలో, ఎక్కువసార్లు ఆహారం ఇవ్వాలి. నీరు తగినంత తాగాలి. తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. మద్యం-పొగ వంటివి మానెయ్యాలి.
నూనె/కొవ్వు: నూనె, నెయ్యి వంటి కొవ్వులేవీ లేకుండా వండే వంటకాలు ఏమంత రుచికరంగా ఉండవు. పథ్యాల పేరుతో ఇలాంటివే పెట్టటం వల్ల మొత్తం తిండే తగ్గిపోతుంది. అసలు కామెర్లలో నూనె, కొవ్వు తినకూడదన్న పథ్యానికి శాస్త్రీయమైన ఆధారాలేం లేవు. పైగా అస్సలు నూనె/కొవ్వు తగలని తిండి పెట్టటం వల్ల కోలుకునే వేగం తగ్గి, ఎక్కువ రోజులు వ్యాధితో బాధపడాల్సి వస్తోందని కూడా గుర్తించారు. అంతేకాదు, కొవ్వులేని ఆహారానికే పరిమితం కావటం వల్ల కిడ్నీ సంబంధ సమస్యలు రావచ్చు. వీటికి తోడు- కొవ్వులో మాత్రమే కరిగే ఎ, డి, ఇ, కె విటమిన్లుంటాయి, వీరిలో ఈ విటమిన్ల లోపమూ తలెత్తుతుంది. కాబట్టి... కామెర్ల రోగికి ఎప్పటిలాగే తగినంత నూనె వంటివి వేసి వండిన పదార్థాలు ఇవ్వాలి, దానివల్ల రోగి ఇష్టంగా తింటారు, వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు.
ప్రోటీన్లు: ప్రోటీన్లంటే పప్పు, మాంసం వంటివాటి నుంచి లభించే మాంసకృత్తులు. వీటిని కూడా తగినంత ఇవ్వాలి. లేకపోతే ప్రోటీన్ల లోపం తలెత్తి.. పొట్టలోనూ, కాళ్లలోనూ నీరు చేరుతుంది. కండరాలు కరిగిపోయి, మనిషి శుష్కించినట్లవుతారు. కాబట్టి వెన్న తీసిన పాలు, పెరుగు వంటివి.. చిక్కుళ్లు, బీన్స్‌, సోయా ఉత్పత్తులు, గుడ్లు, తేలికపాటి మాంసం ఇవ్వాలి.
ఉప్పు: మొత్తం మానెయ్యాల్సిన పని లేదుగానీ కొంత తగ్గిస్తే మంచిది. చాలామంది మజ్జిగ, బార్లీ వంటివే తాగాలని భావిస్తూ రుచికోసం చాలా ఉప్పు కలుపుకొంటుంటారు. ఇలా ఉప్పు ఎక్కువెక్కువ తినటం సరికాదు. కాలేయ సమస్యలున్న కొందరికి ఒంటికి నీరుపడుతుంది. వీరికి ఉప్పు మరింత కఠినంగా నియంత్రించాలి.
పండ్లు: తాజా పండ్లు, కూరగాయలు తేలికగా జీర్ణమవటమే కాదు, వాటిలో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. వీటిల్లోని ‘యాంటీ ఆక్సిడెంట్లు’ కాలేయ కణాలు దెబ్బతినకుండా, త్వరగా కోలుకునేలా చేస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి తాజాపండ్లు, కూరగాయలు దండిగా తినటం మంచిది.
నివారణ ముఖ్యం 
హెపటైటిస్‌ ఎ, ఇ వైరస్‌ల కారణంగా తలెత్తే సాధారణ కామెర్లకు మూలం ఆహారం, నీరు కలుషితం కావటమే. కాబట్టి సుదూర ప్రయాణాలు, జాతరలు, తిరునాళ్లు, జనసమ్మర్థమైన ప్రదేశాల్లోనే కాదు.. ఇళ్లలో కూడా తాగునీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవటం, వేడివేడి ఆహారం తీసుకోవటం మంచిది. బయట కోసి అమ్మే పండ్ల ముక్కలు, సరిగా వండని, పూర్తిగా ఉడికించని చేపలు-మాంసం వంటివి తినకూడదు. కామెర్లు తీవ్రంగా ఉన్నప్పుడు, తగ్గిన తర్వాత కూడా ఆర్నెల్ల పాటు మద్యం అస్సలు ముట్టకపోవటం మంచిది.


కాలేయ వ్యాధి దీర్ఘకాలం ఉంటే..
కాలేయ వ్యాధి చాలాకాలం.. అంటే ఆర్నెల్లకు మించి కొనసాగుతుంటే దాన్ని దీర్ఘకాలిక కాలేయ వ్యాధిగా పరిగణిస్తారు. దీనికి చాలావరకూ హెపటైటిస్‌ బి, సి వైరస్‌లు, మద్యం, కాలేయం చుట్టూ కొవ్వు పేరుకోవటం, కొన్ని మందుల వంటివే కారణమవుతుంటాయి. చాలామందికి ఈ దశలో పెద్దగా బాధలు, లక్షణాల వంటివేం ఉండవు. పరీక్షలు చేస్తేనే తప్పించి వీళ్లకు దీర్ఘకాలిక లివర్‌ వ్యాధి ఉందని కూడా తెలియదు. కొందరికి మాత్రం ఆకలి తగ్గటం, బాగా నలతగా అనిపించటం, తీవ్రమైన అలసట వంటి సాధారణ లక్షణాలే ఉంటాయి. కొందరిలో ఈ దశ ఇలాగే కొనసాగుతుంది, కొందరిలో మాత్రం లివర్‌ గట్టిపడిపోయే ‘సిరోసిస్‌’ దశలోకి వెళుతుంది. కాలేయం గట్టిపడితే దానిలోకి రక్త ప్రవాహం సరిగా ఉండదు. దీంతో కాలేయంలోకి రక్తాన్ని తీసుకువచ్చే సిరల్లో పీడనం పెరిగిపోతుంది. దీన్నే ‘పోర్టల్‌ హైపర్‌టెన్షన్‌’ అంటారు. అలాగే కీలక మార్గాలు మూసుకోవటం వల్ల మిగతా రక్తనాళాలు కూడా బాగా పెద్దవవుతాయి. రక్తం లివర్‌లోకి వెళ్లకుండా బయట నుంచే వస్తుండటం వల్ల రక్తశుద్ధి సరిగా జరగక.. రక్తంలో అమైనో ఆమ్లాలు, అమ్మోనియా, విషతుల్యాల వంటివన్నీ పెరిగిపోతుంటాయి. ఇవి రక్తంలో కలిసి మెదడును చేరటం వల్ల మనిషి గందరగోళపడటం, తాత్కాలికమే అయినా మతిమరుపు వంటి సమస్యలన్నీ బయల్దేరతాయి.
మూడు దశలు: సిరోసిస్‌లో మూడు దశలుంటాయి. తొలిదశలో పైకి కనిపించేంతటి లక్షణాలేమీ ఉండవు. తర్వాతి దశల్లో చాలామందికి ఒంట్లో నీరు చేరుతుంది. ఆ తర్వాత రక్తపు వాంతులు, కిడ్నీలు చెడిపోవటం వంటివన్నీ మొదలవుతాయి. మొత్తమ్మీద ఈ లక్షణాలన్నీ కూడా సిరోసిస్‌ బాగా ముదిరిన తర్వాతే కనబడతాయి. కాబట్టి వీరికి ఆహారం, పథ్యాలు చాలా ముఖ్యం. ఏ దశలో ఎలాంటి ఆహారం ఇవ్వటం వల్ల ప్రయోజనం ఉంటుందన్నది వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలించి, సిఫార్సు చేస్తారు.
పథ్యం ఎవరికి? 
*  కేవలం దీర్ఘకాలిక లివర్‌ వ్యాధి మాత్రమే గలవారు, సిరోసిస్‌ ఉండి కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ లేని వారు ప్రత్యేకించి పథ్యాలేమీ చెయ్యాల్సిన పని లేదు. సాధారణ ఆరోగ్యవంతులు ఏం తినొచ్చో ఈ దీర్ఘకాలిక లివర్‌ వ్యాధి ఉన్నవాళ్లూ అదే తినొచ్చు. మద్యం మానెయ్యటం, బరువు పెరగకుండా చూసుకోవటం కాలేయానికి ఎంతో మంచిది. వీళ్లు రకరకాల ముడి ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపలు, సోయా, గుడ్ల వంటివన్నీ ఉండే సమతులాహారం తీసుకోవాలి. కొవ్వులు, ఉప్పు, తీపి పదార్థాలు మాత్రం కొద్దిగా తగ్గించి తినటం మేలు. ఆహారం కొద్దికొద్దిగా, ఎక్కువసార్లు తీసుకోవటం మంచిది.
ఇక కాలేయం గట్టిపడటం మొదలై, పూర్తిస్థాయిలో సిరోసిస్‌ ఉన్న వాళ్లు మాత్రం ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సిరోసిస్‌ బాధితుల్లో తిన్న ఆహారంలోని పోషకాలను, పోషకాహారాన్ని శరీరం సరిగా వినియోగించుకోలేదు. దీంతో పోషకాహార లోపం పెరిగిపోయి శుష్కించిపోతుంటారు. సమస్య ముదిరిన కొద్దీ ఆకలి తగ్గిపోవటం, తీవ్రమైన అలసట వంటివి పెరిగి.. చివరికి తిండి తినటం కూడా కష్టంగా తయారవుతుంది. దీంతో వీరు వ్యాధితో పోరాటం కూడా చెయ్యలేని స్థితిలోకి జారిపోతుంటారు. తిన్నది జీర్ణం కావటం కూడా కష్టంగా తయారవుతుంది. ఈ స్థితిలో వీళ్లు పోషకాహార లోపంలోకి జారిపోకుండా చూడటం, తగినంత శక్తి అందేలా చూడటమే పెద్ద విషయంగా తయారవుతుంది. అందుకని వీరికి ఆహారంలో కొన్ని మార్పులు అవసరం.
పిండి పదార్థాలు: సిరోసిస్‌ బాధితుల్లో కేలరీలు త్వరగా ఖర్చవుతుంటాయి. అందువల్ల తగినన్ని పిండి పదార్థాలు తీసుకోవాలి. తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినాలి. రాత్రిపూట కాస్త ఆలస్యంగా భోజనం చేయటమూ మంచిదే.
కొవ్వు మితంగా: కొవ్వులతో ఆహారానికి రుచి పెరుగుతుంది. ఆకలి మందగించిన సిరోసిస్‌ బాధితులకిది మేలు చేస్తుంది. అయితే కొవ్వులను మితంగానే తీసుకోవాలి. బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులు.. అవిసె గింజలు, ఆలివ్‌ నూనె, చేప నూనెలతో లభించే కొవ్వులు మంచివి.
ఉప్పు తక్కువ: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే ఒంటికి నీరు పట్టటం వంటి సమస్యలు చుట్టుముడతాయి. కాబట్టి ఉప్పు రోజుకు 2 గ్రాముల కన్నా మించకూడదు.
ప్రోటీన్‌ అవసరం: ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కోవటానికి, దెబ్బతిన్న కాలేయ కణాలు కోలుకోవటానికి ప్రోటీన్‌ తోడ్పడుతుంది. ప్రోటీన్‌ తగ్గితే ఒంట్లో నీరు చేరటం మరింత తీవ్రమవుతుంది. అందువల్ల తగినన్ని ప్రోటీన్లు తీసుకోవాలి.
పండ్లు, కూరగాయలు: రోజుకు కనీసం 5 సార్లు తాజా పండ్లు, కూరగాయలు తినాలి. వీటితో పొటాషియం, విటమిన్‌ సి, బీటా కెరటిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి పోషకాలెన్నో లభిస్తాయి. ఇక వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
చక్కెర, మిఠాయిలు: అప్పుడప్పుడు మిఠాయిలు, తీపి పదార్థాలు తింటే ఇబ్బందేమీ లేదు గానీ.. వీటితోనే కడుపు నింపేస్తే ఆరోగ్యకర పదార్థాలు తినటానికి చోటుండదు.
మద్యం: మద్యం ఎక్కువగా తాగితే సిరోసిస్‌, కాలేయ జబ్బు, కాలేయ క్యాన్సర్‌ వంటి వాటికి దారితీస్తుంది. దీర్ఘకాలిక హెపటైటిస్‌ గలవారికి ఈ ముప్పులు మరింత ఎక్కువ. కాబట్టి మద్యం పూర్తిగా మానెయ్యాలి.
ద్రవాలు: కాలేయజబ్బు బాధితులంతా ద్రవాలు తగ్గించాల్సిన అవసరం లేదు. రోజుకు కనీసం 6-8 గ్లాసుల ద్రవాలు తీసుకోవాలి. సోడియం స్థాయులు తక్కువగా గలవారు మాత్రం రోజుకు లీటరు కన్నా తక్కువ నీరు తాగాలి. జ్వరం, వాంతులు, విరేచనాలు తలెత్తితే మరింత ఎక్కువగా నీరు తాగాలి.

Post a Comment

Previous Post Next Post