వెలలేని బహుమతి
రవి మంత్రిప్రగడ
‘‘చెప్తాలే... కానీ నువ్వు మధ్యలో పుల్ల పెట్టకూడదు...’’ అన్నాడు వేలు చూపిస్తూ.
‘‘వెధవా... సరే వెళ్లు. ఈ టీ తీసుకెళ్లి అమ్మమ్మ వాళ్లకిచ్చేసిరా’’ వేలు వెనక్కి మడిచి, టీ గ్లాసులు చేతికిచ్చింది.
బోర్లా పడుకున్న మాధవ్ వీపు తొక్కుతున్నాడు చిన్నాడు వసంత్. ఆయన కాళ్లు ఒళ్లో పెట్టుకుని ఒత్తుతోంది కూతురు హేమ.
‘‘మహారాజభోగం...’’ టీ పక్కన పెడుతూ అంది రాధ.
‘‘ఊఁ... టీ లో యాలకుల వాసన గుబాళిస్తోంది. లే నాన్నా వసంత్, ఇక చాలు దిగు’’
‘‘నాన్నగారూ...’’
‘‘ఊఁ...’’
‘‘నాకు సైకిల్ కొనిపెట్టరా?’’
‘‘ఇదా నువ్వడుగుతా అన్నది. నీకు అప్పుడే సైకిలెందుకురా వంశీ? పదో తరగతి అయ్యాక కొనొచ్చులే.’’
‘‘అప్పుడు కూడా ఫస్టుక్లాసొస్తేనే...’’ అన్నాడు మాధవ్ గ్లాసులో పైన చిన్నగా ఉన్న తొరకను వేలితో తీసేస్తూ...
‘‘నిన్ను మధ్యలో రావొద్దని ముందే చెప్పా కదమ్మా... నేను నాన్నగారినడుగుతుంటే? అందరూ సైకిల్ మీద వస్తున్నారు స్కూల్లో... నీక్కూడా ఇంట్లో ఏమన్నా కావాలంటే వెళ్లి తేవడానికి నాకు సులువుగా ఉంటుంది.’’
‘‘పర్లేదు. అంత అవసరం అయితే నాన్న సైకిల్ ఉందిగా. వాడు అడిగాడు కదా అని మీరు కొనేరు గనక... వీడికి కొంటే మిగతా ఇద్దరూ ఏడుస్తారు.’’
‘మనం కూడా అడగాలి గామోను’ అన్నట్టు ఒకళ్లని ఒకళ్లు చూసుకున్నారు హేమ, వసంత్.
‘‘ప్లీజ్ నాన్నగారూ...’’
‘‘చూద్దాంలే... లెక్కల్లో నూటికి నూరు తెచ్చుకో... కొంటా.’’
‘‘అంతకన్నా మీ సైకిల్ మీద తిరగడమే సులువు. అమ్మా నేను ఆడుకోడానికెళ్తున్నా’’ తర్వాత చెప్పేది వినిపించుకోకుండా బయటకి వెళ్లిపోయాడు వంశీ.
* * *
‘‘ఏమే సుబ్బులూ... నీ వయసెంతే?’’ పచ్చి కొబ్బరాకు నుండి పుల్లల్ని కత్తిపీటతో వేరు చేస్తూ అడిగింది మాణిక్యం.
‘‘నా వయసు గోల నీకెందుకే?’’ పుల్లల ఈనెల్ని మరో కత్తిపీటతో తీస్తూ అంది సుబ్బులు.
‘‘అబ్బ చెప్పూ...’’
‘‘ఆ ఎంత... నీకన్నా ఓ నాలుగేళ్లు చిన్న అంతేగా...’’
‘‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నాట్ట... చింతకాయలా రవంత ఉండి నీ వయసు తెలీట్లేదుగానీ నాకన్నా పెద్దదానివి కదూ నువ్వు.’’
‘‘అయితే ఏవిట్ట ఇప్పుడు? అయినా తెలిసి అడగడం ఎందుకూ?’’
‘‘ఆహా... ఇంకా ఎన్నాళ్లుంటావా అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది మాణిక్యం.
‘‘ఓసి... నిన్ను తగలెయ్యా. నామీద పడ్డాయా నీ కళ్లు? నా మనవళ్ల చదువులు అయ్యి, పెళ్లిళ్లు చూసేదాకా నేనెక్కడికీ పోను’’ వేరు చేసిన కొబ్బరి పుల్లల్ని పురికొసతో చుడుతూ చెప్పింది సుబ్బులు.
‘‘ఆయనకి ఒక బండి కొనిద్దాం అనుకుంటున్నా... ఏమంటారు?’’ అంది అప్పుడే అక్కడికొచ్చిన రాధ.
‘‘మాధవ నిన్ను అడిగాడేవిటే రాధా?’’ అడిగింది మాణిక్యం.
‘‘లేదత్తయ్యా, కానీ ఆయనకి చాలా ఇష్టం... అప్పుడప్పుడూ ఆ నారాయణ బండి నడుపుతారు సరదాకి. మన పరిస్థితి తెలుసుగా... అందుకే కావాలన్న ఆలోచన కూడా రాలేదు కాబోలు.’’
‘‘ఊఁ...’’
‘‘మొన్న వంశీగాడు సైకిల్ కొనమన్నప్పుడు నాకు అనిపించింది... వాడికంటే నాన్న ఉన్నాడు, కాబట్టి అడిగాడు. ఈయన ఎవర్ని అడుగుతారు?’’
‘‘మరే... ఒక వయసొచ్చాక అంతేనే పిల్లా. మనకోసం మనం ఏదీ కొనుక్కోలేం. కావాలని ఎవర్నీ అడగలేం. పైగా వీటికి తోడు పిల్లలు... ఏదన్నా కొందామన్నా డబ్బు దండగ ఎందుకు, వాళ్ల భవిష్యత్తు కోసం అవసరం అవుతాయిలే అని మన అవసరాల్ని వాయిదాలు వేసుకుంటూ పోతాం.’’
‘‘అందుకే ఆయనకి కొనిద్దాం అనుకుంటున్నా. మీ ఇద్దరి అభిప్రాయం అడుగుదామని...’’
‘‘మంచి ఆలోచనే... అల్లుడు పాపం ఏదీ కొనుక్కోడు తనకోసం. ఎంత కావాలేవిటి?’’
‘‘స్కూటరు కొనాలంటే కనీసం ఇరవైవేలైనా కావాలి...’’
‘‘ఏవిటీ, టీవీలో వస్తుంది అదా?’’
‘‘ఆఁ...’’
‘‘సిరి కొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలనీ... అలాంటివి ఉన్న వాళ్లకోసం. మనకెందుకే అంత ఖర్చు. మూడేళ్లనాడు కొన్న టీవీకే ముప్పు తిప్పలు పడ్డాం. ఇప్పుడు ఇరవైవేలు ఎక్కణ్ణుంచి తెస్తామే. ఏ లూనానో కొనేస్తే పోయే...’’ అంది మాణిక్యం కత్తిపీటని మడిచి ఒక మూలన పెడుతూ.
‘‘చెప్పేది వినండి అత్తయ్యా... అప్పుడంటే ఆయన చిన్న స్కూలు. ఇప్పుడు హైస్కూలుకి మారాక పరిస్థితి కాస్త బాగానే ఉంది. కొత్త స్కూటరుకి మనం తూగలేంగానీ, నారాయణ తన బండి అమ్మేద్దాం అనుకుంటున్నాడట, వాళ్లావిడ చెప్పింది మొన్న. తర్వాత వేరే ఏదో కొనుక్కుంటాడల్లే ఉంది.’’
‘‘కానీ మన దగ్గర అంత డబ్బు లేదుకదే. ఎంత తక్కువయ్యాయి ఇంతకీ? పోనీ అదేదో వాణ్ణే కొనేసుకోమంటే పోయే. ఏ లోనో పెట్టేస్తాడు.’’
‘‘అందుకే ఆయనకి చెప్పకుండా కొనాలన్నది.’’
‘‘పోనీ ఇదిగో ఈ దుద్దులు ఇచ్చేయనా? నాకెందుకు బంగారం...’’ తియ్యబోయింది సుబ్బులు.
‘‘నువ్వాగవే... నీకున్నవే అవి. అవి కూడా లేకుండా నీ బోడి మొహాన్ని చూళ్లేం’’ నవ్వుతూ వారించింది మాణిక్యం.
‘‘మరేంచేద్దామని?’’
‘‘ఇప్పుడే కొనలేము... దీపావళినాటికి పోగెయ్యగలిగితే చాలు.’’
‘‘ఓ... బ్రహ్మాండం... ఆరునెల్లు పైనే ఉంది.’’
* * *
‘‘ఒరేయ్ త్వరగా పాలు తాగండి...’’ స్కూల్‌కి లంచ్‌బాక్స్‌లు సర్దుతూ వంటింట్లోంచి అరిచింది రాధ.
‘‘పాలా? నాకు మాల్టోవా కావాలి’’ మారాం చేశాడు వసంత్.
‘‘పాలే బలం నాన్నా... అవన్నీ ఒంటికి మంచిది కాదట... గబగబా పాలు తాగెయ్.’’
‘‘పోనీ పాలు తాగాక ఏడుకొండలు బండి దగ్గర పూరీ తెచ్చుకోమా మరి?’’ అడిగింది హేమ.
‘‘పూరీ లేదు... గీరీ లేదు. సుబ్బరంగా తరవాణీ చేశాను. మాగాయ వేసుకుని అది తినేసి వెళ్లండి. బలానికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం’’ లోపలినుండి అరిచింది మాణిక్యం. (మజ్జిగపైన పలచగా తేలిన తేటని కొద్దిగా అన్నం, దబ్బ ఆకులు వేసి ఒక కుండలో రాత్రి పులియ బెట్టి మర్నాడు తింటారు. సాధారణంగా వేసవిలో ఎక్కువ తింటారు. దీన్నే తరవాణీ అంటారు.)
‘‘తరవాణీయా...’’ మొహం చిట్లించాడు వంశీ.
ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులు పిల్లలకి అర్థం కాలేదు. కిరాణా ఖర్చు సగానికి సగం తగ్గింది. వెనక దొడ్లో అమ్మమ్మా, నాన్నమ్మా కలిసి కూరగాయల మొక్కలు పెంచడం మొదలెట్టారు. మధ్యాహ్నాలు బళ్లో జీళ్లూ, బఠాణీలూ కొనుక్కోవడానికి అమ్మ ఇచ్చే డబ్బులు ఆగిపోయాయి. అప్పుడప్పుడూ ఇచ్చే పావలా అర్ధా చిల్లర సరే సరి. కోపం వచ్చేసింది వంశీకి.
‘‘ప్యాంటు కుట్టించమంటే నాన్నగారి ప్యాంటు సైజు చేయించింది అమ్మ. ప్రతీసారి నోటు పుస్తకాలకి నాన్నగారిని పంపేది ఈ సారి తనే వచ్చింది. అవసరం అయినవాటిలో సగానికి సగం తగ్గించేసింది. డబుల్ రూల్ కాగితాల పుస్తకానికి మధ్యలో పేజీ త్రికోణంలా మడత పెట్టి ముందు నుంచి సైన్సు, వెనక నుండి సోషలు రాస్కోమంది. తెలుక్కీ, ఇంగ్లీషుకీ కూడా ఒకటే పుస్తకం. పుస్తకాలకి అట్టలు వేసుకోవాలీ బ్రౌన్ పేపర్‌కి డబ్బులిమ్మంటే న్యూస్ పేపర్లు చింపి అట్టలు వేసింది. ఆఖరుకి లాస్ట్ ఇయర్ నోటు పుస్తకాల్లో మిగిలిన పేజీలన్నీ కలిపి కుట్టి రఫ్ వర్క్ చేస్కోమని ఇచ్చింది. ఎందుకింత పీనాసి తనం?’’ ఉక్రోషంగా అరిచాడు వంశీ. వంటగదిలో ఉన్న రాధకి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాడన్నది నిజమే అనిపించింది.
‘‘ఒరేయ్... ఇలారా...’’ పక్కన కూర్చోపెట్టుకుంది మాణిక్యం. వసంత్, హేమ కూడా వచ్చారు ఇంతలో.
‘‘పిచ్చిదిరా మీ అమ్మ. మొదటిసారి ఆశపడింది... మీ నాన్నకి ఒక స్కూటరు కొనిద్దామని. అందుకే ఇంట్లో ఖర్చులు తగ్గించేశాం. మేము సినిమాలకి వెళ్లడం కూడా మానేశాం. అది రాత్రి వరకూ మిషను కుడుతోంది. నేనూ, మీ అమ్మమ్మా కలిసి రేగువడియాలూ, గుమ్మడి వడియాలూ, అప్పడాలూ, వత్తులూ... ఏది చేయగలిగితే అది చేస్తున్నాం. దానికోసం అది ఒక చీర కూడా అడగదు. మీ నాన్నంటే దానికి చచ్చేంత ప్రేమ. మీరంటే ఇష్టం. ఎవర్నీ కష్టపెట్టడం దాని ఉద్దేశం కాదు. ఏదో... చేయగలమేమో ఇంట్లో ఆడవాళ్లం అందరం కలిసి అని అనుకున్నాం. కాదంటే ఏముంది అన్నీ మామూలుగానే జరుగుతాయి. ఇప్పుడేంటీ నీకు డబ్బులు కావాలి, అంతేగా...?’’ కొంగుమూట విప్పుతూ అడిగింది.
‘‘అమ్మా... సారీ...’’ పరిగెత్తుకువెళ్లి అటు తిరిగున్న రాధని పట్టుకుని ఏడ్చేశాడు వంశీ.
‘‘మేం కూడా సారీ అమ్మా...’’ హేమా, వసంత్ కూడా చెప్పారు.
‘‘ఛీ ఊర్కో...’’ అంది వాడి కళ్లని తన చీర కొంగుతో తుడుస్తూ.
‘‘ఎప్పుడు కొంటాం అమ్మా స్కూటర్?’’ అడిగింది హేమ.
‘‘తెలీదమ్మా... ఇంకా చాలా డబ్బులు కావాలి. నాన్నగారికి తెలియనివ్వద్దు.’’
‘‘సర్‌ప్రైజ్...’’ ముగ్గురు పిల్లలూ ఒకేసారి అన్నారు.
* * *
శ్రావణమాసం వచ్చేస్తోంది...
ఇప్పుడు పొడుగు చేతులూ, అద్దాలూ, ముత్యాలూ ఉన్న జాకెట్లకి డిమాండ్ బాగా పెరిగింది. జిగ్‌జాగ్ మిషన్ కొని ఓ పక్క రాధ జాకెట్లు కుడుతుంటే పెద్దవాళ్లిద్దరూ కాజాలు, అద్దాలు కుట్టడం నేర్చేసుకున్నారు. మాధవ్‌నీ, పిల్లలనీ స్కూళ్లకి పంపి పొద్దున్న తొమ్మిదింటికి మిషను ఎక్కితే రాత్రివరకూ ఇదే పని రాధకి. ఇంటి ముందు చిన్న సైజు బోర్డు కూడా పెట్టేసింది. ఇంతకు మునుపు సరదాగా కాలక్షేపం కోసం చేసే పనులన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగంలా చేస్తున్నారు. పెద్దవాళ్లు సత్సంగాలూ, మధ్యాహ్నం నిద్రలూ మానేశారు.
‘‘రాధా పడుకో... పదవుతోంది...’’ లోపలినుండి పిలిచాడు మాధవ్.
‘‘మీరు పడుకోండి. మాకు పనుంది. అమ్మవారి బొమ్మ చెయ్యాలింకా... రేపు వరలక్ష్మీ వ్రతం కదా.’’
‘‘ఊఁ...’’
శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజు... పొద్దున్నే పూజా, సాయంత్రం వరకూ పేరంటాలు అన్నీ అయి, ఇంటి పనులన్నీ అయ్యాక చీర కూడా మార్చుకునే ఓపికలేక అలాగే వచ్చి పడుకుంది రాధ. కాసేపటికి... నడుము మీద చల్లగా తగిలింది. చీరని కొద్దిగా పక్కకి జరిపి మెల్లగా అమృతాంజనం మర్దనా చేస్తున్నాడు మాధవ్. హాయిగా ఉంది ప్రాణం.
‘‘ఎందుకు ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలా పనులు చేసేస్తున్నారు మీరు ముగ్గురూ?’’
‘‘ఖాళీగా కూర్చోలేక అంది రాధ...’’
‘‘కాలక్షేపం కోసం చెయ్యడం వేరు. అదే పనిగా చెయ్యడం వేరు... నీకు పెద్దగా చెప్పక్కరలేదు... కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో...’’
‘‘ఇదిగో... మీరిలా సపర్యలు చేస్తుండగా నాకేంటి.. ఏ బాధా తెలీదు.’’
‘‘మొండి...’’
‘‘పొద్దున్నే లేపండి... చాలా పని...’’ మాట్లాడుతూనే నిద్రపోయింది. కిటికీలోంచి వచ్చే వెలుతురు రాధ మెడ మీద ఉన్న గంధం మీద పడి మెరుస్తోంది. పువ్వులూ, పన్నీరూ కలిసిన ఒక చిత్రమైన వాసన. కొద్దిగా చెదిరిన కాటుక, పెద్ద కుంకం బొట్టు, మొహంమీద అక్కడక్కడా పడిన చామంతి రేకలతో భారంగా ఊపిరి తీస్తోంది. చెదిరిన జుట్టుని మెల్లగా సరిచేసి, ఒక్కో చామంతి రేకని జాగ్రత్తగా మొహం మీంచి ఏరి, నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి పొదువుకుంటూ ‘పిచ్చి మొహం...’ అనుకున్నాడు.
* * *
‘‘ఏమే రాధా... దీపావళి వచ్చేస్తోంది... ఇంకా ఎంత కావాలే?’’ అడిగింది మాణిక్యం ఒకరోజు.
‘‘చెప్తా ఉండండి అత్తయ్యా...’’ లోపలినుండి కాగితం, పెన్నూ తీసుకొచ్చి లెక్కలెయ్యడం మొదలెట్టింది.
1. ఆంద్రాబ్యాంకులో ఆర్డీ- ఇరవై మూడు వేల నాలుగొందల చిల్లర, కానీ మొత్తం తీసేస్తే ఆయన తంతారు. కాబట్టి పదివేలు తీసుకుందాం. 2. నేను ఇంటి ఖర్చులు పోను దాచినవి- ఆరువేల ఎనిమిదొందలు, కొంచెం అటుఇటుగా. 3. జాకెట్లు కుట్టడం వల్ల మిగిలినది- ఏడువేల ఆరొందల చిల్లర. 4. మీ వత్తులూ, అప్పడాలూ, వడియాల డబ్బులు- నాలుగున్నర వెయ్యి.
మొత్తం సుమారుగా ఇరవై తొమ్మిది వేలు.. ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ చూసుకున్నారు ముగ్గురూ.
‘‘సుబ్బరంగా కొత్త బండే కొనచ్చు కదే... వాడూ వీడూ వాడింది మనకెందుకు?’’
‘‘కొత్త బండికి సరిపోవే అమ్మా... ఇంకా కొద్దిగా కావాలి’’ మరోసారి డబ్బుని లెక్కపెడుతూ అంది రాధ.
‘‘నీ మొహం... మంచిమాట చెప్పింది సుబ్బులు. ఎంత తక్కువైతే అంత ఆ సుబ్రహ్మణ్యంగాడి దగ్గర తెస్తాను. మనమేం పారిపోతామా? ఎదురుగానే ఉన్నాంగా. పైగా కష్టపడటం అలవాటయింది. రాబోయేది, దీపావళి, కార్తీకమాసం, ఇదిగో అదుగో అంటూ సంక్రాంతి... అన్నీ బావుంటే మూణ్ణెళ్లలో వడ్డీతో సహా వాడి అప్పు తీర్చెయ్యొచ్చు. సంవత్సరం తిరిగే సరికి బ్యాంకులో ఆర్డీ కూడా పూడ్చేయ్యొచ్చు. ఇంతకీ వాడికేం బండి కావాలో తెలుసా?’’
‘‘ఆహా... నాకు తెలీదా ఆయన ఇష్టాలు?’’ కళ్లు ఎగరేస్తూ అంది రాధ.
‘‘మేము కూడా కొంచెం డబ్బులు దాచాం... ఇవ్వమా?’’ అన్నాడు అప్పుడే స్కూలు నుండి వచ్చి ఇదంతా వింటున్న వంశీ.
‘‘అక్కర్లేదురా నాన్నా... సరిపోతాయి’’ వాడి బుగ్గ చిదిమి అంది రాధ.
‘‘అయితే మేము హెల్మెట్ కొనిస్తాం ఇవ్వాళే...’’
‘‘ఒరేయ్ ఒరేయ్... ఆత్రపు పెళ్లికొడుకు అత్త మెళ్లో తాళి కట్టాడనీ, అంత తొందరెందుకురా... ముందు బండిరానీ ఇంటికి. తర్వాత మీరు కొందురుగానీ’’ మనవడి మాటకి మురిసిపోతూ అంది మాణిక్యం.
* * *
దీపావళి...
‘‘అమ్మా... ఎక్కడికెళ్లారమ్మా నాన్నగారు?’’
‘‘తెలీదురా...’’ అంది దీపాలు వెలిగిస్తూ గుమ్మం వైపు చూస్తున్న రాధ.
‘‘ఏడే వీడు? ఎప్పుడెప్పుడు బండి చూస్తాడా అని ఉంది నాకు’’ ప్రమిదల్లో నూనె పోస్తూ అంది మాణిక్యం.
‘‘నాకూ అలాగే ఉంది అత్తయ్యా... వెళ్లే ముందు చెప్పలేదు... సైకిల్ కూడా ఇక్కడే ఉంది.’’
‘‘నాన్నగారొస్తున్నారూ...’’ వీధి గుమ్మంలోంచి అరుస్తూ వచ్చాడు వసంత్. అందరూ గుమ్మంలో నుంచుని చూస్తున్నారు.
కొత్త సైకిల్ భుజం మీద పెట్టుకుని మాధవ్ వస్తుంటే వంశీ కళ్లకి వాళ్ల నాన్న ఒక హీరోలా కనిపించాడు.
‘‘నాన్నగారూ...’’ కళ్లు పెద్దవి చేసుకుని ఆనందంగా అన్నాడు వంశీ.
‘‘అడిగావు కదరా..?’’ సైకిల్ కింద పెడుతూ అన్నాడు మాధవ్.
‘‘థ్యాంక్యూ నాన్నా...’’ చుట్టేశాడు.
‘‘అది అలా పెట్టి ఇలా రారా మాధవా... నీకోసం కూడా ఒక సప్రైజు...’’
‘‘సప్రైజుకాదు నాన్నమ్మా... సర్‌ప్రైజ్...’’ నవ్వారు పిల్లలు ముగ్గురూ.
‘‘ఏదో ఒకటి... పదండి ముందు...’’ వెనక నుండి తోసింది రాధ.
ఇంటి పక్కన సందులో అందమైన నీలం రంగు స్కూటర్ ఉంది. ఖాళీ నంబరు ప్లేటు, పువ్వుల దండతో కొత్తది అని తెలుస్తోంది.
‘‘ఎవరిదీ?’’ పెద్దగా తెరిచిన నోటిని చేతితో అడ్డు పెట్టుకుని, ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు మాధవ్.
‘‘మీది... మనది... ఇది మా ఆర్నెల్ల కష్టం. సంవత్సరం పొదుపు. ‘ఎందుకూ, వద్దూ’ అనకండి... ఇంతమందిని ఒంటిచేత్తో మోస్తున్న మీ భారాన్ని కాస్త మమ్మల్ని మోయనివ్వండి... నచ్చిందా...’’
‘‘ఊఁ...’’ పెదవుల్ని బిగపట్టి వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ తల ఆడించాడు.
‘‘పిల్లలున్నారు... బాగోదు’’ కన్ను గీటింది తాళాలని చేతికిస్తూ.
‘‘థాంక్స్ అమ్మా... అత్తయ్యా మీక్కూడా...’’
‘‘మాకెందుకూ...’’ ఒకేసారి అన్నారిద్దరూ.
‘‘ఏవండీ, బండి స్టార్ట్ చెయ్యండి... అత్తయ్యని తీసుకెళ్లి గుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి.’’
‘‘ఇది మరీ బావుంది. బూడిదగుమ్మడి కాయల్లా నేనూ మీ అమ్మా ఎందుకు? నువ్వెక్కు.’’
వద్దు వద్దు అంటున్నా రాధని బలవంతంగా స్కూటర్ ఎక్కించారు పెద్దవాళ్లిద్దరూ.
వంశీ సైకిల్ మీద హేమ... స్కూటర్ మీద మాధవ్, రాధ, వసంత్...
‘‘ఎలా ఉంది బహుమతి..?’’ భుజంమీద చెయ్యి వేసి వెనకనుండి వంగి అడిగింది రాధ.
‘‘ఎప్పటికీ మర్చిపోలేని, ఎవ్వరూ వెలకట్టలేని బహుమతి ఇది. మీరందరూ ఎన్ని నెలలు... ఎంత కష్టపడి...’’ గొంతు పూడుకుపోయి మాట రాలేదు మాధవ్‌కి. రాధ చేతిని ముద్దు పెట్టుకున్నాడు.
‘‘హమారా బజాజ్... హమారా బజాజ్...’’ అని పాడుతున్నాడు బండి మీద ముందు నుంచున్న వసంత్.
90వ దశకం తొలిరోజులు... ఆదివారం మధ్యాహ్నం... ఆకాశవాణిలో నాటకం వచ్చే సమయం.
‘‘అమ్మా... నేను నాన్నగారిని ఒకటడగాలి...’’
‘‘అబ్బో... ఏవిట్రోయ్ అది... కొంపదీసి పెళ్లి చేసుకుంటావా?’’ వంశీ బుగ్గ గిల్లుతూ అడిగింది రాధ.
‘‘ఛీ అదేంకాదు.’’
‘‘మరి?’’
‘‘సిరి కొద్దీ చిన్నెలు, మొగుడి కొద్దీ వన్నెలనీ... అలాంటివి ఉన్న వాళ్లకోసం. మనకెందుకే అంత ఖర్చు. మూడేళ్లనాడు కొన్న టీవీకే ముప్పు తిప్పలు పడ్డాం.
ఇప్పుడు ఇరవైవేలు ఎక్కణ్ణుంచి తెస్తామే. ఏ లూనానో కొనేస్తే పోయే...’’ అంది
‘‘కాలక్షేపం కోసం చెయ్యడం వేరు. అదే పనిగా చెయ్యడం వేరు...
నీకు పెద్దగా చెప్పక్కరలేదు... కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో...’’
‘‘ఇదిగో... మీరిలా సపర్యలు చేస్తుండగా నాకేంటి.. ఏ బాధా తెలీదు.’’
Post a Comment