మొక్కజొన్న, About Corn

మొక్కజొన్న, About Corn

సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రని నిప్పులమీద మొక్కజొన్న పొత్తు కాలుస్తుంటే వచ్చే ఆ కమ్మని వాసనకి గులాం కాని వాళ్లు ఉంటారంటే నమ్మలేం. అలాంటిది వాటిని తింటే ఉండే రుచి గురించి వేరే చెప్పాలా... ఇక, గింజల్ని ఉడికించి కాస్త వెన్న జోడించి అందించే స్వీట్‌కార్న్‌ వాసనకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అంతేనా... పాలొద్దు టిఫినొద్దు అంటూ మారాం చేసే పిల్లలకు పాలల్లో కాసిని కార్న్‌ఫ్లేక్స్‌ వేసిస్తే మారుమాట్లాడరంటే అతిశయోక్తి కాదు. సూప్‌ తాగినా సలాడ్‌గా తిన్నా ఏ రూపంలో తీసుకున్నా మొక్కజొన్న రుచే వేరు. చిరుతిండిగా తినే పాప్‌కార్న్‌ సంగతి సరేసరి. అందుకే సుమారు తొమ్మిది వేల సంవత్సరాల క్రితమే మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్న నేడు ప్రపంచవ్యాప్త ఆహారంగా మారింది. ఒకప్పుడు మెజో అమెరికన్లు పండించిన మొక్కజొన్నను మాయన్లు పెంచి పోషించారని చెప్పాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ దీన్ని వాళ్లు కూరగాయగానూ అల్పాహారంగానూ చిరుధాన్యంగానూ వాడుతూనే ఉన్నారు. అంతేకాదు, జన్యుమార్పుల ద్వారా మేలైన వంగడాలనూ సృష్టిస్తున్నారు.
రంగు పండింది! 
మనకు ఎక్కువగా పసుపు, తెలుపు రంగుల్లోని సాదా, తీపిమొక్కజొన్న(స్వీట్‌కార్న్‌)లు మాత్రమే తెలుసు. కానీ ఎరుపూ, గులాబీ, వూదా, ఆకుపచ్చా, నలుపూ, నీలమూ, హరివిల్లూ... ఇలా మనకు తెలీని రంగులు చాలానే ఉన్నాయి. ఒక్కో రంగుదీ ఒక్కో ప్రత్యేకత. పసుపు రంగు కార్న్‌లో ల్యూటెన్‌, జియాక్సాంథిన్‌... వంటి కెరోటినాయిడ్లు ఎక్కువగా ఉంటే, నీలి రంగు మొక్కజొన్నలో ఆంథోసైనిన్ల శాతం ఎక్కువ. వూదారంగు మొక్కజొన్నలో హైడ్రాక్సీ బెంజాయిక్‌ ఆమ్లం దొరుకుతుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన యాంటీఆక్సిడెంట్లలా పనిచేస్తాయి.
రంగుల సంగతలా ఉంచితే, ఉపయోగించే పద్దతిని బట్టి ఫ్లోర్‌, పాప్‌, డెంట్‌, ఫ్లింట్‌, స్వీట్‌, వాక్సీ... ఇలా ఆరు ప్రధాన రకాలుగా మొక్కజొన్నల్ని చెప్పవచ్చు. ఫ్లోర్‌, ప్లింట్‌, డెంట్‌... రకాలను ఎక్కువగా పిండికీ ఫ్లేక్స్‌కీ వాడితే, వేడి చేసినప్పుడు పాప్‌ అయ్యే రకాన్ని మాత్రం పాప్‌కార్న్‌గానే వాడతారు. జన్యుమార్పు ద్వారా ఆవిర్భవించిన స్వీట్‌కార్న్‌ను నేరుగానూ లేదా ఉడికించీ తింటారు. మెరుస్తున్నట్లుగా ఉండే వ్యాక్సీ రకాన్ని టెక్స్‌టైల్స్‌, కాగితం తయారీ పరిశ్రమలతోబాటు మెయొనెజ్‌, మార్గరిన్‌, చూయింగ్‌గమ్‌, ఐస్‌క్రీమ్‌ తదితర ఆహారపదార్థాల్లోనూ వాడుతుంటారు. జిగటదనం దీని ప్రత్యేకత. పోతే, బేబీ కార్న్‌కోసం స్వీట్‌ లేదా ఇతర రకాల మొక్కజొన్నల్ని లేత దశలోనే కోయడం లేదా అందుకోసమే సృష్టించిన వంగడాలనూ వేస్తుంటారు. ఇవే కాదు, కంటెయినర్లలో మాత్రమే పెరిగే బ్లూ జేడ్‌, మెరిసే రత్నాల్లాంటి గ్లాసీ కార్న్‌, అందంకోసమూ పెంచే పాడ్‌ కార్న్‌... లాంటివి వృక్షశాస్త్ర నిపుణుల్ని సైతం చకితుల్ని చేస్తున్నాయి. మొత్తంగా ఏ రకం మొక్కజొన్నతో అయినా రొట్టెలూ కూరలూ పలు రకాల స్నాక్‌ వెరైటీలూ చేసుకోవచ్చు. ఉడికించిన గింజల్ని సలాడ్లూ సూపుల్లోనూ వాడుకోవచ్చు.
ఎంతో మంచిది! 
తాజాగా ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్‌... లాంటి పోషకాల శాతం మరింత పెరుగుతుంది.
* రోజువారీ అవసరమైన పీచు ఓ కప్పు కార్న్‌ గింజలనుంచి దొరుకుతుంది. ఇది జీర్ణసంబంధ సమస్యల్ని నివారిస్తుంది. మలబద్ధకంతోబాటు కొలొరెక్టల్‌, పేగు క్యాన్సర్లనూ అడ్డుకుంటుంది.
* మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా పాంటోథెనిక్‌ ఆమ్లం జీవక్రియకు దోహదపడుతుంది. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువే. ఇ-విటమిన్‌ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
* మొక్కజొన్నలో ఖనిజాల శాతమూ ఎక్కువే. ఫాస్ఫరస్‌ మూత్రపిండాల పనితీరుకి తోడ్పడితే, మెగ్నీషియం ఎముక బలాన్ని పెంచుతుంది.
* ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. ఫెరూలిక్‌ ఆమ్లం క్యాన్సర్‌ నిరోధకంగా పనిచేస్తూ రొమ్ము, కాలేయ క్యాన్సర్లతో పోరాడుతుంది. వూదారంగు మొక్కజొన్నల్లోని ఆంతోసైనిన్‌లు సైతం క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటాయి. ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ నివారిస్తాయని తాజా పరిశోధనలూ చెబుతున్నాయి. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది.
* పసుపురంగు కార్న్‌లో కంటికీ చర్మానికీ అవసరమైన బీటాకెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుంది.
* మొక్కజొన్నల నుంచి తీసిన నూనెలో అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులూ స్టెరాల్స్‌ ఎక్కువగా ఉండటంవల్ల అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదపడతాయట. రక్తనాళాల్లో పాచి పేరుకోకుండా చేయడంద్వారా గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చేస్తాయి. బీపీనీ తగ్గిస్తాయట.
* కార్న్‌లోని ఐరన్‌ రక్తహీనతనీ తగ్గిస్తుంది.
* మొక్కజొన్నలోని ఫైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పేరుకోకుండా చేస్తుంది. చూశారుగా... మనం సరదాగా కాలక్షేపంకోసం తినే రుచికరమైన మొక్కజొన్నలో ఎంత ఆరోగ్యం దాగుందో... అయితే తియ్యదనంకోసం మొక్కజొన్న నుంచి తీసిన కార్న్‌ సిరప్‌ను ప్రాసెస్‌డ్‌ ఆహారపదార్థాలూ శీతలపానీయాల్లో విరివిగా వాడుతుంటారు. ఈ సిరప్‌లో ఫ్రక్టోజ్‌ శాతం ఎక్కువ. అది ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. కాబట్టి వాటితో మాత్రం కాస్త జాగ్రత్త!

Post a Comment

أحدث أقدم