వరల్డ్ హెపటైటిస్ డే, లివర్ కేన్సర్, కాలేయం, డబ్ల్యూహెచ్‌ఓ, World Hepatitis Day




Sakshi | Updated: July 24, 2016 01:37 (IST)
కాలేయం ఖల్లాస్
జూలై 28 వరల్డ్ హెపటైటిస్ డే
హెపటైటిస్... ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇదొకటి. హెపటైటిస్‌లో ఎ, బి, సి, డి, ఇ, జి అనే రకాలు ఉన్నాయి. హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో బాధపడుతున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా దీర్ఘకాలిక హెపటైటిస్-బి, హెపటైటిస్-సితో దాదాపు 50 కోట్ల మంది బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు దారితీస్తున్న వ్యాధుల్లో హెపటైటిస్ ఎనిమిదో స్థానంలో ఉంది. హెపటైటిస్-బి, హెపటైటిస్-సి ముదిరిపోతే లివర్ సిర్రోసిస్, లివర్ కేన్సర్ వంటి ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తాయి. సకాలంలో నియంత్రించకుంటే హెపటైటిస్ మొత్తం కాలేయాన్నే ఖల్లాస్ చేసేస్తుంది.
హెపటైటిస్ ఏ రకానికి చెందినదైనా, ఇది కాలేయానికి సోకే ఇన్ఫెక్షన్ వల్ల తలెత్తే వ్యాధి. సకాలంలో గుర్తించి, తగిన చికిత్స తీసుకోకపోతే కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. హెపటైటిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో చాలావరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ముదిరితే పచ్చకామెర్లు, ఆకలి తగ్గుదల, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా సందర్భాల్లో వైరస్ వల్ల హెపటైటిస్ తలెత్తుతుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో పారాసెటిమాల్ వంటి నొప్పి నివారణ మందులు, పారిశ్రామిక వ్యర్థాలు, మొక్కలకు చెందిన విష పదార్థాలు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా హెపటైటిస్‌కు దారితీసే అవకాశాలు ఉన్నాయి.
దీర్ఘకాలికంగా హెపటైటిస్ కొనసాగితే, కాలేయం మొద్దుబారడం, బిరుసెక్కడం వంటి దుష్పరిణామాలు తలెత్తుతాయి. చివరకు లివర్ సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక పరిస్థితులూ వాటిల్లుతాయి. సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల హెపటైటిస్ సోకుతుంది. అయితే, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల, పరాన్న జీవుల వల్ల, మితిమీరిన మద్యం అలవాటు వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మద్యం అలవాటు లేకపోయినా, కొందరిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (ఎన్‌ఏఎఫ్‌ఎల్) వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అరుదుగా కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల, కాలేయానికి గాయం కావడం వల్ల కూడా హెపటైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇలా గుర్తించాలి
చాలా సందర్భాల్లో హెపటైటిస్ సోకినా ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అందువల్ల ఎప్పటికప్పుడు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించడం సాధ్యమవుతుంది. రక్త పరీక్ష, అల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్, ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా, లివర్ బయాప్సీ ద్వారా హెపటైటిస్‌ను గుర్తిస్తారు. పరిశుభ్రత పాటించడం, కలుషితమైన నీటికి, ఆహారానికి దూరంగా ఉండటం ద్వారా చాలా వరకు హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. హెపటైటిస్-సి, హెపటైటిస్-ఇ మినహా మిగిలిన రకాల హెపటైటిస్‌కు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నందున ముందుగానే వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా చాలా వరకు రక్షణ పొందవచ్చు. వ్యాధి ఉన్నట్లు పరీక్షల్లో తేలితే వెంటనే తగిన చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధిని నయం చేసుకోవచ్చు.
ఆర్థికభారం
అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను హెపటైటిస్ వ్యాధి ఆర్థిక వ్యవస్థపై పెను భారం మోపుతోంది. పనిచేసే వయసులో ఉన్న వ్యక్తికి హెపటైటిస్ సోకితే కనీసం 27 పనిదినాలు నష్టపోవాల్సి వస్తుంది. చాలా దేశాల్లో హెపటైటిస్ చికిత్స కారణంగా ఎదురవుతున్న ఆర్థికభారంపై కచ్చితమైన అంచనాలేవీ లేవు. అయితే, అమెరికా ఆర్థికరంగంపై హెపటైటిస్ కారణంగా ఏటా 650 కోట్ల డాలర్ల (రూ.43,595 కోట్లు) భారం పడుతున్నట్లు అంచనా.
అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే హెపటైటిస్ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ప్రపంచానికి పెనుసవాళ్లలో ఒకటిగా నిలుస్తున్న హెపటైటిస్‌పై అవగాహన కల్పించేందుకు 2010లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) జూలై 28వ తేదీని వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ‘హెపటైటిస్‌ను నివారించండి: అది మీ చేతుల్లోనే ఉంది’ నినాదంతో ప్రచారం చేపడుతోంది.
నివారణ జాగ్రత్తలు
* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరుగుదొడ్లను క్రిములకు దూరంగా ఉంచుకోవాలి.
* ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు మరొకరు వాడకుండా ఉండాలి. ఆస్పత్రులలో డిస్సోజబుల్ సిరంజీలు, సూదులు వాడాలి.
* రక్తమార్పిడి చేసే ముందు రక్తాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, వ్యాధులేవీ లేవని నిర్ధారించుకోవాలి.
* వ్యాధి సోకిన వారితో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి.
* కలుషితమైన ఆహారానికి, నీటికి దూరంగా ఉండాలి.
హెపటైటిస్ వాస్తవాలు
* హెపటైటిస్-బి, హెపటైటిస్-సి మాత్రమే లివర్ కేన్సర్‌కు దారితీస్తాయి. హెపటైటిస్-ఎ వల్ల లివర్ కేన్సర్ సోకే అవకాశం లేదు.
* రోగనిరోధక శక్తి బలంగా ఉన్నవారికి హెపటైటిస్-ఎ ఒకవేళ సోకినా, ఎలాంటి చికిత్స తీసుకోకపోయినా దానంతట అదే నయమైపోతుంది.
* కలుషితమైన నీరు, ఆహారం వల్ల హెపటైటిస్-ఎ సోకుతుంది.
* రక్తం, ఇతర శరీర స్రావాలు, మ్యూకస్ ద్వారా, లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకుతుంది.
* హెపటైటిస్-బి సోకినవారిలో 90 శాతానికి పైగా చిన్నారులే. ఈ వైరస్ సోకిన తల్లుల నుంచి వారికి ఈ వ్యాధి సంక్రమిస్తోంది. లైంగిక సంబంధాల ద్వారా హెపటైటిస్-బి సోకే అవకాశాలు ఉన్నా, అవి చాలా అరుదు.
* గర్భిణిగా ఉన్నప్పుడు హెపటైటిస్ సోకితే, గుర్తించిన తర్వాత వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే, పుట్టే పిల్లలకు వ్యాధి సోకకుండా కాపాడుకోవచ్చు.
* హెపటైటిస్-బి సోకిన వారిలో 25 శాతం మందికి మాత్రమే సిర్రోసిస్ లేదా కేన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మిగిలిన వారు చికిత్స తర్వాత సాధారణ జీవితం గడిపే అవకాశాలు ఉంటాయి.
* హెపా-బి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే లివర్ కేన్సర్ సోకకుండా బయటపడవచ్చు.
* హెచ్‌ఐవీ సోకిన వారికి హెపటైటిస్-సి సోకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
* ఒకరికి వాడిన సూదులు, రేజర్లు మరొకరికి వాడటం, రక్తమార్పిడి వంటి కారణాల ద్వారా కూడా హెపటైటిస్-సి సోకుతుంది.
టాగ్లు: వరల్డ్ హెపటైటిస్ డే, లివర్ కేన్సర్, కాలేయం, డబ్ల్యూహెచ్‌ఓ, World Hepatitis Day, Liver cancer, Liver, WHO

Post a Comment

أحدث أقدم