విజయాలకు విశాల దృష్టి, For Success


++++++విజయాలకు విశాల దృష్టి++++++
పోటీపరీక్షల్లో అంతిమంగా ఎంపికయ్యేవారి జాబితాలో నిలవాలంటే ఇందుకు ఉపకరించే మార్గం గ్రహించాలి. ఎంతోమంది టాపర్లకు దారిచూపిన ఆ బాట... సమగ్ర వీక్షణం (హోలిస్టిక్‌ వ్యూ)!
ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం సాధించినవారిని చూసి ఆ ప్రయత్నంలో నిరాశపడిన వారందరూ అది వారికెలా సాధ్యపడిందా అని మధనపడుతుంటారు. ‘మేమూ వారిలాగానే కృషి చేశాం కదా’ అని బాధపడుతుంటారు. కానీ విజేతల ప్రయత్నం వేరుగా ఉంటుంది.
ఒక పక్షి భూమి నుంచి దూరంగా అల్లంత ఎత్తుకు ఎగిరి ఆపై భూమిని చూస్తే ఎలా ఉంటుంది? పోటీపరీక్షల సిలబస్‌ విషయంలో కూడా సమగ్ర వీక్షణ దృష్టితో కృషి ప్రారంభిస్తే విజేతల విజయ రహస్యాన్ని అందిపుచ్చుకున్నట్టే! అంటే... ఒక అంశాన్ని వేర్వేరు భాగాలుగా కాకుండా సంపూర్ణంగా పరిశీలించడం.
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల పోటీ పరీక్షలైన గ్రూప్స్‌ సిలబస్‌లను చూద్దాం. సన్నద్ధత ప్రారంభించే సమయంలో ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకుని... దాన్ని ఇన్ని రోజుల్లో పూర్తిచేయాలి అన్న సంకల్పంతో చదవడం మొదలుపెట్టేయడం ఒక ఎత్తు. సాధారణంగా అందరూ చేసే పనే ఇది. దీనివల్ల ప్రిపరేషన్‌ కొంతకాలం గడిచిన తర్వాత, నడిచివచ్చిన దారి... ఇంకా ముందుకువెళ్ళాల్సిన మార్గం విషయంలో గందరగోళంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది.
అదే- ప్రారంభ సమయంలో సిలబస్‌ మొత్తాన్నీ విహంగ వీక్షణం చేసి మొత్తం ఉన్న పేపర్లు ఎన్ని? సబ్జెక్టులు ఎన్ని? వాటిలోని అధ్యాయాలెన్ని? వీటిలో అభ్యర్థి తన కోణంలో తనకు పరిచయం ఉన్న సబ్జెక్టులు- పరిచయం లేని సబ్జెక్టులుగా వర్గీకరించుకుని అప్పుడు దేనికెంత వ్యవధి కావాలి? పరీక్ష జరిగేనాటికి ఇప్పటికి చేతిలో ఉన్న సమయం ఎంత? దేనికెంత సమయం కేటాయించుకోవాలి? ఫస్ట్‌ ప్రిపరేషన్‌, రివిజన్‌లకు దేనికెంత వ్యవధి కేటాయించుకోవాలి? అన్న విశ్లేషణ చేసుకొని ప్రణాళికగా రూపొందించుకుని చదవడం ప్రారంభిస్తే? అప్పుడు మీ ప్రిపరేషన్‌ అశ్వంపై లక్ష్యంవైపు దౌడు తీసే సైనికుడిలా సాగుతుంది. ఇదే ప్రణాళికరీత్యా హోలిస్టిక్‌ వ్యూ అప్రోచ్‌.... సమగ్రవీక్షణ విధానం. ఇదే పంథాను సన్నద్ధతలోనూ అనుసరించాలి.
సిలబస్‌ సంపూర్ణ వీక్షణం 
ఇటీవలే ఏపీపీఎస్‌సీ నూతన సిలబస్‌ విడుదలైంది. గ్రూప్‌-2 రాయాలనుకుంటున్న మహేష్‌ అనే అభ్యర్థి నోటిఫికేషన్‌ ఏ క్షణాన్నయినా రావచ్చునన్న ఉద్దేశంతో పేపర్‌-1 జనరల్‌స్టడీస్‌లో తనకు కష్టమైన సైన్స్‌ విభాగానికి పుస్తకాలు సేకరించి ప్రిపరేషన్‌ ఆరంభించేశాడు. ఇంకా ఎవరూ సన్నద్ధతకు కూర్చోకముందే తాను మొదలుపెట్టినందుకు అతడు తనను తాను అభినందించుకున్నాడు.
ఇదే సమయంలో నరేష్‌ అనే అభ్యర్థి కూడా సిలబస్‌ వెల్లడి కావడం గమనించాడు. అతని లక్ష్యమూ గ్రూప్‌-2నే. అతడు మొత్తం పరీక్షా విధానాన్ని పరిశీలించాడు. ఎన్ని పేపర్లున్నాయో, ఒక్కో పేపర్లో ఎన్ని యూనిట్లు/సెక్షన్లు ఉన్నాయో, మార్కుల వెయిటేజి ఎంతో తెలుసుకున్నాడు. ఎప్పుడైతే నరేష్‌ ఈ కోణంలో మొత్తం పేపర్లను విహంగ వీక్షణం చేశాడో అతడి మదిలో లక్ష్యసాధనకు చక్కటి ప్రణాళిక మెదిలింది. రాతపరీక్ష ఎప్పుడు ఉండవచ్చో సీనియర్లను అడిగి అంచనా వేసుకున్నాడు. ఆపై చక్కటి ప్రణాళికతో సన్నద్ధతకు ఉపక్రమించాడు. ఇదంతా అతడు సిలబస్‌ను సమగ్ర వీక్షణం చేయటం వల్లనే సాధ్యపడింది.
ఈ హోలిస్టిక్‌ అప్రోచ్‌ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. 
* అనుసంధానం: సమగ్ర వీక్షణ దృక్పథాన్ని అభ్యర్థి అలవర్చుకోవడం వల్ల సారూప్యం ఉన్న అంశాలను అనుసంధానం చేసి చదివేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
ఉదాహరణకు.. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించనున్న గ్రూప్‌-2కు హాజరు కాబోయే అభ్యర్థి పేపర్‌-1లోని 7వ విభాగం తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం అన్న అంశాన్ని ప్రత్యేకంగా చదవనవసరం లేదు. ఎందుకంటే... పేపర్‌-2లో సెక్షన్‌-1 భారతదేశ, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో భాగంగా ఈ అంశాలు కవర్‌ అవుతాయి. అలాగే జీఎస్‌లోని ఆరో విభాగం భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం అన్న అంశాలు కూడా పేపర్‌-2, సెక్షన్‌-1లో అధ్యయనం చేయవచ్చు.
* మిళితం: పరీక్ష విధానాన్ని సంపూర్ణంగా వీక్షించడం వల్ల మరొక సౌలభ్యం ఏర్పడుతుంది. సిలబస్‌లోని ఏ విభాగమూ వేర్వేరు కాదు. అన్నీ ఒక తానులోని ముక్కలే. ఈ సమ్యక్‌ దృష్టి ఏర్పడినపుడు ప్రిపరేషన్‌ పంథానే మారిపోతుంది.
ఉదాహరణకు... గ్రూప్‌-1లోని ప్రిలిమినరీని వేరుగా, మెయిన్స్‌ను వేరుగా ఈ తరహా అభ్యర్థులు చూడరు. రెండింటి మధ్య అనుసంధానం ఉన్నందువల్ల ప్రిలిమినరీ దశలోనే మెయిన్స్‌కు తయారవుతారు. ఇంకా చెప్పాలంటే.. ప్రిలిమినరీలోని ఒక టాపిక్‌ను మెయిన్స్‌ స్థాయి వరకూ చదువుతాడు. ఈ తరహా ప్రిపరేషన్‌ వల్ల రెండు దశల పరీక్షలను ప్రతిభావంతంగా రాయగలుగుతాడు.
* త్యజించడం: పరీక్ష విధానాన్నీ, పాఠ్యాంశాలనూ ఎప్పుడైతే విశాలదృష్టితో పరిశీలిస్తారో, సమగ్ర వీక్షణ దృష్టితో సిద్ధమవుతుంటారో అలాంటి అభ్యర్థికి పాఠ్యాంశాలపై పట్టు ఏర్పడుతుంది. దానికితోడు గత ప్రశ్నపత్రాల అధ్యయనం కూడా ఉంటే మరింత సాధికారత ఏర్పడి కొన్ని అంశాలను త్యజించేంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టును వడపోస్తూ సమయాన్ని ఎక్కువగా తీసుకునేవాటిని మినహాయించుకోవచ్చు. దీనివల్ల మిగిలిన అంశాలపై మరింతగా దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.
ఈ విధానాన్ని అవలంబించినవారికి మరికొన్ని అదనపు ప్రయోజనాలు సమకూరతాయి. పరీక్ష రాయబోయే పేపర్లోని సబ్జెక్టు తుది-మొదలుపై ముందే ఒక పరిశీలన చేసినందువల్ల ఆపై చదివే ప్రతి అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది.
టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష రాసే అభ్యర్థి తెలంగాణ సంస్కృతిపై ముందే ప్రాథమిక పరిశీలన చేసినందున అందులో అంతర్భాగంగా వచ్చే ఏ అంశాన్నయినా ఆ కోణంనుంచి చదువుతున్నందున... అర్థం కావడంలో అవాంతరాలుండవు. దీనివల్ల అపారమైన సమయం ఆదా అవుతుంది.
సబ్జెక్టును దేనికి దాన్ని విడివిడిగా చదవడం కంటే విహంగవీక్షణం అనంతరం అధ్యయనం చేయడం వల్ల వేగంగా విషయ అవగాహన సాధ్యమై సమయం వృథా కాదు. పైగా విషయంపై ఎప్పుడైతే పట్టు ఏర్పడుతుందో ఆపై మర్చిపోయేందుకు ఆస్కారం ఉండదు. ఈ విధానంలో తయారైన అభ్యర్థులు గతంలో చదివిన వివిధ విషయాలను త్వరగా గుర్తు తెచ్చుకోగలుగుతారు. పరీక్షల్లో ప్రశ్నలకు అందరికంటే వేగంగా స్పందించగలుగుతారు.
సబ్జెక్టును దేనికి దాన్ని విడివిడిగా చదవడం కంటే విహంగవీక్షణం అనంతరం అధ్యయనం చేయడం వల్ల వేగంగా విషయ అవగాహన సాధ్యమై సమయం వృథా కాదు. పైగా విషయంపై ఎప్పుడైతే పట్టు ఏర్పడుతుందో ఆపై మర్చిపోయేందుకు ఆస్కారం ఉండదు.
సాధన చేసేదెలా?
చాలా సరళమిది. మేడపైనుంచి చూసినప్పుడు పరిసరాలన్నిటిపై చక్కటి అవగాహన ఏర్పడినట్టే ఈ విహంగ వీక్షణం విధానం ద్వారా టాపర్ల మాదిరి గెలుపును సొంతం చేసుకోవచ్చు. సమగ్ర వీక్షణానికి దోహదపడే కొన్ని సోపానాలు.. 
1 అంతిమ ఫలితం... ముందే: దీన్నే ‘ఎండ్‌ ఇన్‌ బిగినింగ్‌’ అంటారు. అంటే ఒకే కార్యాన్ని ప్రారంభించడానికి ముందే అంతిమ ఫలితాన్ని మదిలోకి తెచ్చుకోవడం. మొక్కను నాటేటప్పుడు అది కొద్దికాలంలోనే పెరిగి, పెద్దదై... పెద్ద చెట్టు అయినట్టు, పూలు ఫలాలతో కళకళలాడుతున్నట్లు వూహించడం. అప్పుడు సహజంగానే అంతులేని ఉత్సాహం వస్తుంది. మొక్కవోని దీక్ష ఏర్పడుతుంది. పోటీపరీక్షల్లో సన్నద్ధత ప్రారంభంలోనే తుది ఫలితం తనకు అనుకూలంగా వచ్చినట్టు విశ్వసించడం వల్ల ఆత్మవిశ్వాసంతో సన్నద్ధత కొనసాగించవచ్చు.
2 విశాలం... సూక్ష్మం: సాధారణంగా ప్రిపరేషన్లో భాగంగా ఏ సబ్జెక్టునైనా సంపూర్ణంగా చూస్తే... కలవరపాటుకు గురికావొచ్చు. ‘ఇంత విస్తృతమైన, లోతైన సబ్జెక్టును చదవాల్సివుంటుందా?’ అన్న బెరుకు ఏర్పడవచ్చు. కానీ ఈ విశాల వీక్షణం ద్వారా ఏర్పడిన అవగాహన తదుపరి సాధన వరకూ వచ్చేసరికి సంక్షిప్తం చేసుకోవాలి. అంటే సబ్జెక్టు మొదలు-చివరలను పరిశీలించిన తర్వాత గత ప్రశ్నపత్రాల ద్వారా కొన్ని టాపిక్స్‌ను వదిలివేసి సూక్ష్మంగా రూపొందించుకోవాలి.
3 సూక్ష్మ ఎంపిక.. దీర్ఘ అధ్యయనం: ఎక్స్‌టెన్సివ్‌ రీడింగ్‌- ఇంటెన్సివ్‌ స్టడీ విధానాన్ని అవలంబించేందుకు ఈ సమగ్ర వీక్షణ విధానం మార్గం చూపుతుంది. చాలామంది టాపర్లు ఈ పరిస్థితిని సూచిస్తున్నందున విహంగ వీక్షణం- పరిశీలన ద్వారా అంశాలను ఎంపిక చేసుకుని ఆపై లోతైన అధ్యయనం చేయాలి. ప్రశ్నపత్ర స్వరూపం ఎలా ఉన్నా సరైన ప్రతిభ చూపగలుగుతారు.
4 నిత్యజీవితంలో: సమగ్ర దృష్టిని కేవలం పరీక్షల ప్రిపరేషన్లోనే అమలు చేయాలనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఈ పరిశీలనా సాధన నిత్యజీవితంలోనూ వర్తింపజేస్తేనే అలవాటుగా మారుతుంది. ఉదాహరణకు... మొబైల్‌ ఫోన్‌ను కొనాలనుకుంటే చటుక్కున షాపుకు వెళ్ళి చూపించిన నాలుగు మోడల్స్‌లో ఒకటి కొనేసే అలవాటుకు స్వస్తి చెప్పాలి. కొనేది ఒకే మొబైల్‌ అయినప్పటికీ మొత్తం మోడల్స్‌ అన్నిటినీ పరిశీలించే సమగ్ర దృష్టిని అలవరుచుకోవాలి. ఇలా నిత్యజీవితంలో అవకాశం ఉన్నంతవరకూ ప్రతిచోటా ఈ సూత్రాన్ని వర్తింపజేయాలి.
ఇలా వినియోగించుకోవాలి 
సబ్జెక్టు పరిశీలన: విశాల వీక్షణం ద్వారా వివిధ పేపర్లు, సబ్జెక్టులను ఆసాంతం పరిశీలించాలి. వివిధ సబ్జెక్టుల సిలబస్‌ల మధ్య అనుసంధానం ఏమైనా ఉందా? ఏమైనా టాపిక్స్‌ను సమగ్ర దృష్టి రీత్యా సిలబస్‌ పరిధి దాటి ఇతర పుస్తకాలు చదవాల్సివుందా అన్న విషయాలు స్పష్టం చేసుకోవాలి.
కీలక అంశాల గుర్తింపు: రాయబోయే పోటీ పరీక్షరీత్యా మొత్తం సబ్జెక్టులో కీలక అధ్యాయాలు, అంశాల గుర్తింపు రెండో దశలో జరగాలి. ప్రిపరేషన్‌ సమయంలో మిగతావాటిని నిర్లక్ష్యం చేయాలని దీని అర్థం కాదు. కానీ ముఖ్య అంశాల గుర్తింపు వల్ల చదివేటప్పుడు వాటిపై ఫోకస్‌ పెరుగుతుంది.
విషయపరమైన లోతుపాతులు: వివిధ సబ్జెక్టులను ఆసాంతం పరిశీలించిన తర్వాత... ముఖ్యాంశాల గుర్తింపు అనంతరం- విషయపరంగా ఆ సబ్జెక్టు లోతుపాతులను గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా అంచనా వేసుకోవాలి. దీన్ని బట్టే ప్రశ్నల స్థాయి ఆధారపడివుంటుంది.
నిత్య అధ్యయనం: ఇప్పటివరకూ చేసినది మానసిక కసరత్తుగానే పరిగణించాలి. ఇప్పుడిక అసలైన ఘట్టంలోకి వచ్చినట్టు. అభ్యర్థి అధ్యయనమే నిజమైన జయాపజయాలను నిర్దేశిస్తుందని మరువరాదు.
స్వీయపరీక్ష: ఎంత చదివినా పరీక్షలో చూపేదే అసలైన ప్రతిభ. అసలైన పరీక్ష రాయకపోయినా ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టును పరిశీలించే స్వీయపరీక్షను అభ్యర్థే నిర్దేశించుకోవాలి. తన విశాల దృష్టి పరిశీలన- అధ్యయనం ఎంతవరకూ ఫలిస్తుందో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి.

Post a Comment

أحدث أقدم